భూ వాతావరణంలోకి వచ్చిన చంద్రయాన్-3 లాంచ్ వెహికల్

భారత్ ఈ ఏడాది విజయవంతంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్టు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊహించిన దాని కంటే అద్భుతంగా పనిచేసింది. చంద్రుడిపై రహస్యాలు తెలుసుకునేందుకు వెళ్లిన చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టడం, ఆ తర్వాత రోవర్ అక్కడ 14 రోజుల పాటు కలియ దిరగడం, అక్కడ తీసిన ఫొటోలు, వీడియోలు, మట్టి, అందులో మూలకాలపై కీలక వివరాలు ఇవ్వడం పూర్తయ్యాయి. 
 
ఆ తర్వాత మంచులో కూరుకుపోయిన చంద్రయాన్ 3 కథ ముగిసిందని అంతా భావించారు. ఇస్రో కూడా ఇదే తేల్చేసింది. చంద్రయాన్-3ని ఈ ఏడాది జులై 14న విజయవంతంగా ప్రయోగించారు. 124 రోజుల తర్వాత రాకెట్ భాగం భూవాతావరణంలోకి ప్రవేశించింది.  ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ (ఐఏడీసీ) ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ 25 ఏళ్ల జీవిత కాలానికి అనుగుణంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది.
దాని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ఉంచిన ఎల్‌విఎం3 ఎమ్4 వాహక నౌక యొక్క క్రయోజెనిక్ ఇంజన్ విడి భాగం ఒకటి ఇస్రో నియంత్రణ కోల్పోయింది. 
ఇస్రో లింక్ తెగిపోయిన సదరు వాహక నౌక భాగం తిరిగి వెనక్కి రావడం మొదలు పెట్టింది. ఇలా నియంత్రణ లేకుండా కిందకు పడిపోతున్న ఆ భాగం తాజాగా భూమి వాతావరణం లోకి కూడా వచ్చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇస్రో ఇప్పుడు వెల్లడించింది.

చంద్రయాన్ 3 వాహక నౌకలోని క్రయోజనిక్ ఇంజన్ భాగం భూమి  వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. అంతే కాకుండా ఈ భాగం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కూడా గుర్తించింది. అయితే ఇది భారత్ మీదుగా వెళ్లలేదని కూడా నిర్దారించింది.  రాకెట్ బాడీ LVM-3 M4 లాంచ్ వెహికల్‌లో భాగమని ఇస్రో తాజా ప్రకటనలో పేర్కొంది.
అయితే ఇది బుధవారం మధ్యాహ్నం 2.42 గంటలకు మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. చంద్రయాన్ 3 ప్రయోగించిన 124 రోజుల్లోనే ఈ రాకెట్ బాడీ భూవాతావరణంలోకి రీఎంట్రీ జరిగింది. ఇది చంద్రయాన్ ప్రయోగం తర్వాత మిషన్ ఆర్బిటల్ జీవితకాలం, అంతర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ, ఇస్రో సిఫార్సు చేసిన తక్కువ-భూమి కక్ష్య వస్తువుల కోసం పెట్టుకున్న 25-సంవత్సరాల నియమానికి అనుగుణంగానే ఉందని ఇస్రో వెల్లడించింది.
 
అంతర్జాతీయంగా ఆమోదించబడిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీ రీఎంట్రీ ఉందని నిర్ధారించింది. ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం తర్వాత భారత్ పేరు దేశ విదేశాల్లో మార్మోగుతోంది. చంద్రయాన్ 3 ప్రయోగం స్ఫూర్తితో ఇస్రో మరిన్ని ప్రయోగాలకు తెరదీసింది.  ఇప్పటికే చంద్రయాన్ 3 విజయం తర్వాత సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కూడా చేపట్టింది. ఇప్పటికే ఆదిత్య నౌక సూర్యుడికీ, భూమికీ మధ్య ఉన్న లాగ్రాంజ్ పాయింట్ వద్దకు వెళ్లే మార్గంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇస్రో చంద్రయాన్ అప్ డేట్ ఇచ్చింది.