పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీతో బ్రిటిష్ హోమ్ మంత్రి ఉద్వాసన

గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు నిర్వహించిన ర్యాలీ కారణంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హోమ్ మంత్రి సుయెల్లా బ్రెవర్మన్‌కు క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. భారత సంతతికి చెందిన సుయెల్లా రిషి క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రుల్లో ఒకరు కావడం గమనార్హం. కాగా, విదేశాంగ మంత్రి జేమ్స్ కేవర్లిని హోమ్ మంత్రిగా నియమించిన రిషి సునాక్, మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ను విదేశాంగ మంత్రిగా నియమించారు.

పాల‌స్తీనాకు అనుకూలంగా తీసిన‌ ర్యాలీ విష‌యంలో పోలీసులు వ్య‌హ‌రించిన తీరును ఖండిస్తూ మంత్రి బ్రెవ‌ర్‌మాన్ ఓ ప‌త్రిక‌లో వ్యాసం చేశారు. ఆ వ్యాసంలో ఆమె ప్ర‌ధాని సునాక్ తీరును త‌ప్పుప‌ట్టారు. ప‌త్రిక వ్యాసంలో ఆ మంత్రి వెల్ల‌డించిన అభిప్రాయాల వ‌ల్ల ఘ‌ర్ష‌ణ‌లు మ‌రింత ఉదృతం అయ్యాయి. దీంతో నిర‌స‌న‌కారులు లండ‌న్ వీధుల్లో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని రిషి సునాక్ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింది. బ్రెవ‌ర్‌మాన్ ను వ్య‌క్తిగ‌తంగా స‌మ‌ర్థించినా.. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తున్న‌ట్లు సునాక్ తెలిపారు. తన జీవితంలో హోమ్ మంత్రిగా పనిచేయడం తనకు దక్కిన అత్యంత గొప్ప గౌరవం అని ఆమె ఆ తర్వాత తెలిపారు. తనను మంత్రి పదవి నుండి తొలగించేందుకు దారితీసిన పరిస్థితులపై తర్వాత కొన్ని అంశాలను వెల్లడిస్తానని ఆమె చెప్పారు.

కాగా, ఆమె అర్ధాంతరంగా మంత్రి వర్గం నుండి వైదొలగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు లీజ్ ట్రస్  ప్రభుత్వంలో కూడా 2022లో ఆమె హోమ్ మంత్రిగా పనిచేసారు. అయితే, ఓ అధికార పత్రాన్ని తన వ్యక్తిగత ఇమెయిల్ నుండి పంపారని విమర్శలు తలెత్తడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ, ఆరు నెలల తర్వాత రిషి సునాక్ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఆమె తిరిగి హోమ్ మంత్రిగా  చేరారు.

అయితే, బ్రెవర్మన్‌కు వివాదాలు కొత్తేం కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు. స్పీడ్ డ్రైవింగ్‌ వివాదంలోనూ చిక్కుకున్నారు.  అటార్నీగా ఉన్నప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు గానూ తనకు పడిన ఫైన్‌, పాయింట్లను దాచిపెట్టేందుకు సుయెల్లా ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ.
తన పేరు బయటకు రాకుండా ఉండేలా ఆమె రాజకీయ సాయం కోరడం దుమారం రేపింది.
దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి.  గతేడాది అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు లండన్‌ వెలుపల అతి వేగంగా కారును నడిపినందుకు గానూ బ్రేవర్‌మన్‌కు ఫైన్‌, పాయింట్లు పడ్డాయి. అతి వేగంగా కారు నడిపితే యూకేలో జరిమానా విధిస్తారు. అలాగే, బ్రిటన్‌లో పాక్ సంతతి వ్యక్తులపై కూడా ఆమె నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. 
 
పాకిస్థానీ పురుషులు బ్రిటన్ అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లైంగిక దాడులు చేస్తున్న ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’ ఆగడాలు పెరిగిపోయాయని, ఇందులో పాక్ సంతతి బ్రిటిష్ పురుషులు కూడా ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. 

ఇక, గతేడాది జులైలో పార్టీ గేట్ కుంభకోణం ఆరోపణలతో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని పదవీ కోసం లిజ్ ట్రస్, రిషి సునాక్‌తో పాటు సుయెల్లా బ్రేవర్మన్ కూడా పోటీలో నిలిచారు. కానీ, అప్పుడు సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్‌ ప్రధానిగా ఎన్నికైనా, నెల రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత అక్టోబరులో జరిగిన ఎన్నికల ప్రక్రియలోనూ బ్రెవర్మన్ పోటీకి సిద్ధమై చివరి నిమిషంలో తప్పుకున్నారు.