కాంగ్రెస్ ను దారి తప్పిస్తున్న రాహుల్ ఎన్నికల వ్యూహాలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ రాజకీయవేత్త మల్లిఖార్జున్ ఖర్గే అయినప్పటికీ వాస్తవానికి పార్టీలో మొత్తం పెత్తనం మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులు వంటి అంశాలు అన్నింటి విషయంలో ఆయన మాటే నెగ్గుతుంది.
 
అయితే, రాహుల్ గాంధీ పార్టీ సహచరులతో, సంబంధిత రాష్ట్ర నాయకులతో చర్చలు  జరపకుండా, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎక్కువగా ఆధార పడుతూ ఉండటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. చివరకు ఇతర పార్టీల నుండి వచ్చే నేతలతో ఆయనే నేరుగా సమాలోచనలు జరిపి, కాంగ్రెస్ పార్టీ నుండి హామీలు ఇస్తూ పార్టీ మారేటట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల నాయకులతో సంబంధం లేకుండా నేరుగా రాహుల్ గాంధీతో వ్యవహరిస్తున్నారు.
 
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఆ పార్టీ చేసిన కృషికి మించి బిజెపి స్వయంకృపరాధం ఎక్కువ కారణం అని అందరికి తెలిసిందే.
పైగా, బీసీలలో మంచి పలుకుబడి గల సిద్దరామయ్య వంటి నేత ఉండటం, ఎన్నికల యంత్రాంగాన్ని పకడ్బందీగా నడిపించే వనరులు సమకూర్చగల డీకే శివకుమార్ సారధ్యం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి ఎస్సి, ఇతర అణగారిన వర్గాలను సమీకరించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు దారితీసింది.
 
అయితే, రాహుల్ గాంధీ మాత్రం సునీల్ కనుగోలు కారణంగా కర్ణాటకలో  గెలిచామని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటివరకు తనకు కీలక సలహాదారులుగా ఉంటూ వస్తున్న పార్టీ సహచరులు కె సి వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా వంటి వారిని పక్కకు నెట్టివేసి ఇప్పుడు అంతా కనుగోలు ఎట్లా చెబితే ఆ విధంగా నడుచుకుంటున్నారు.
 
తెలంగాణాలో వైఎస్ షర్మిల వంటి వారితో మంతనాలు జరిపింది ఆయనే కావడం గమనార్హం. అయితే, అదే జరిగితే పార్టీకి ప్రమాదమని రేవంత్ రెడ్డి వంటి వారు అడ్డుపడటంతో ఆమెను చేర్చుకోవడం ఆగిపోయింది.  కర్ణాటకకు చెందిన కనుగోలు వృత్తిరీత్యా అనేక రాజకీయ పార్టీలకు పనిచేశారు.
 
2014 ఎన్నికలలో ప్రశాంత్  కిషోర్ కు చెందిన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్‌కు సర్వే ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ నరేంద్ర మోదీ ప్రచారంలో కీలక పాత్ర వహించారు. తమిళనాడులోని డీఎంకే, ఎఐఎడిఎంకె- రెండింటికీ పనిచేశారు.  అనేక విజయవంతమైన బిజెపి ప్రచారాలను నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్‌లో అమిత్ షాతో సంబంధం కలిగి ఉన్నారు.
 
అకాలిదళ్ కు కూడా సలహాదారునిగా వ్యవహరించారు.  ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల ఎత్తుగడల రూపకలాపనలో కీలక పాత్ర వహిస్తున్నా, ఎక్కువగా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు.  2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని `ఇండియా’ కూటమి వ్యవహారాలలో సహితం రాహుల్ గాంధీకి కీలక సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు. 
 
అయితే రాహుల్ గాంధీ ఎన్నికల వ్యూహాలు దారితప్పుతున్నాయని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో, ముఖ్యంగా బిజెపితో నేరుగా ఎదుర్కొంటున్న మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి బలమైన ఓటు బ్యాంకుగా ఉంటున్న సుమారు 40 శాతం మంది ఓటర్లపైననే కాంగ్రెస్ దృష్టి సారిస్తూ ఉండడాన్ని ప్రస్తావించారు. 
 
ఆ విధంగా చేయడం వల్లన పెద్దగా ప్రయోజనం ఉండబోదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బిజెపికి దూరంగా ఉన్న మిగిలిన ఓటర్ల వైపు దృష్టి సారిస్తే ఆశ్చర్యకర ఫలితాలు సాధింపవచ్చని సూచిస్తున్నారు. `ఇండియా’ కూటమి ఏర్పాటు చేయడమే ప్రధాని మోదీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉమ్మడిగా పడే విధంగా చేసుకోవడమే లక్ష్యం అనే అంశాన్ని రాహుల్ మరచిపోతున్నారు. 
 
అందుకనే మధ్య ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో చిన్న, చిన్న పార్టీలకు పరిమితమైన నియోజకవర్గాలలో మాత్రమే పరిమితంగా బలం ఉన్నప్పటికీ వారి ఓట్లను వదులుకుంటే అంతిమంగా బీజేపీ ప్రయోజనం పొందుతుందనే హెచ్చరికను రాహుల్ పాటించడం లేదు.  సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహంలో సహితం ఎక్కడా చిన్న, చిన్న పార్టీలను దగ్గరకు చేర్చుకోవడం లేకపోవడం అందుకు ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు.  
 
రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ఇటువంటి వ్యూహం కారణంగానే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.
అఖిలేష్ యాదవ్ తన పార్టీని అవమాన పరిచినందుకు, తన పార్టీ వాదనలను పూర్తిగా విస్మరించినందుకు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు.
 
దీనికి ప్రతీకారంగా ఉత్తర ప్రదేశ్ లోని 80 పార్లమెంట్ స్థానాల్లో 65 స్థానాల్లో ఎస్పీ పోటీ చేస్తుందని యాదవ్ ఏకపక్షంగా ప్రకటించారు.  తెలంగాణాలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు సన్నాహాలు వికటించాయి.  మాయావతికి చెందిన బీఎస్పీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గోండ్వానా గంతంత్ర పార్టీతో పొత్తు పెట్టుకోగా, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని  ఆజాద్ సమాజ్ పార్టీ రాజస్థాన్‌లో జాట్, రైతు ఓట్లపై పట్టుగల హనుమాన్ బేనివాల్ నేతృత్వంలోని ఆర్ ఎల్ పి తో పొత్తు పెట్టుకున్నారు. 
 
ఇటువంటి పొత్తులతో వారెన్ని సీట్లు గెలుస్తారన్నది అట్లా ఉంచితే, ఆ విధంగా చేయడంతో ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ అనే విషయం రాహుల్ గుర్తించడం లేదు. బిజెపి సహితం స్థానికంగా పరిమితంగానైనా బలమైన ప్రాతినిధ్యం గల బాగా వెనుకబడిన పలు వర్గాలను దగ్గరకు చేర్చుకొని ప్రయత్నం చేస్తుండటం, ఇప్పటి వరకు ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని వారికి కేంద్ర, రాష్త్ర మంత్రి వర్గాలలో ప్రాతినిధ్యం కల్పిస్తూ వస్తున్నది.