రిషి సునాక్ కు భారత్ దీపావళి బహుమానంగా కోహ్లీ బ్యాట్!

యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటిస్తోన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌‌ను ఆదివారం సతీసమేతంగా కలుకున్నారు. తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ సందర్భంగా భారత్ తరఫున ప్రధాని మోదీ పంపిన దీపావళి కానుకలు గణపతి విగ్రహం, భారత్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను సునాక్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూకే ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. రిషి సునాక్, జైశంకర్‌ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించింది. 
 
ఇదే సమయంలో పండుగ వేళ తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు జైశంకర్ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ‘దీపావళి రోజున ప్రధానమంత్రి రిషి సునాక్ నన్ను పిలవడం ఆనందంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాన. భారత్, యూకేలు సమకాలీన కాలానికి సంబంధించిన సంబంధాలను పునర్నిర్మించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. సునాక్ దంపతులను హృదయపూర్వక ఆదరణ, ఆత్మీయతతో కూడిన ఆతిథ్యానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

కాగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యూకేలో నవంబర్‌ 15 వరకు అధికారిక పర్యటన కొనసాగనుంది. ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్‌ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్‌-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. కాగా, భారత సంతతికి చెందిన రిషి సునాక్బ్రిటన్‌ ప్రధాని పదవిని చేపట్టిన తొలి నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించారు. సునాక్ భార్య అక్షతా మూర్తి సైతం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అని తెలిసిందే.