మరోసారి కెనడా ప్రధాని భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యలతో భారత్ పట్ల తన అసహనాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. మరోసారి ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ పట్ల వివాదాస్పద వాఖ్యలు చేశారు. వియన్నా ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘించిందని ఆరోపించారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. 
 
పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని జస్టిన్‌ ట్రూడో ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని అమెరికా, ఇతర మిత్ర దేశాలను కోరారు. 
 
రూల్ ఆఫ్‌ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెబుతూ ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించారు. 
 
ఈ వివాదం ఇరుదేశాల మధ్య అగ్గి రాజేసింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. అయినా ట్రూడో ఈ వివాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 
 
బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్‌ను నిందించారు. దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తునకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే, తన వివాదాస్పద వాఖ్యలకు మద్దతుగా ఇప్పటి వరకు కెనడా ప్రభుత్వం భారత్ ముందు నిర్దుష్టంగా ఎటువంటి ఆధారాలు చూపలేదని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేస్తూనే ఉన్నారు.