టాటా గ్రూప్ చేతికి ఐఫోన్ల తయారీ ప్లాంట్

భారత్‌లో ఆపిల్‌ ఐఫోన్లను తయారుచేస్తున్న విస్ట్రాన్‌ ఇండియా సంస్థను టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థ టేకోవర్‌ చేసుకోవడం పూర్తయింది. దీంతో ఐఫోన్లను తయారుచేయనున్న తొలి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ అవతరించింది. సంవత్సర కాలం నుంచి దీనిపై చర్చలు జరగ్గా ఇప్పటికి డీల్‌ పూర్తయింది.
 
విస్ట్రాన్ ఇండియాకు చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ సంతకం చేసింది. భారత్‌లోని విస్ట్రాన్ అసెంబ్లీ లైన్‌ కోసం రూ.1040 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో త్వరలో భారతీయ సంస్థ ఆధ్వర్యంలో ఐఫోన్ల తయారీ ప్రారంభం కానుంది. దేశవిదేశాలకు ఈ ఎగుమతి కానున్నాయి.
 
టాటా గ్రూప్ ఇప్పటికే తమిళనాడులోని హోసూర్‌ ప్లాంట్‌లో ఆపిల్ కోసం కొన్ని విడిభాగాలను తయారుచేస్తోంది. ఇక నుంచి అసెంబ్లింగ్ కూడా టాటా గ్రూప్‌ చేపట్టనుంది. ఐఫోన్ల ఉత్పత్తిని 2024 సంవత్సరం మధ్యనుంచి టాటా సంస్థ ప్రారంభించనుంది. ఐఫోన్‌ 16, ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్లు 2024 మరియు 2025 నెలలో విడుదలకానున్నాయి.
 
టాటా తయారీచేసిన ఐఫోన్లు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ సంస్థకు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఐఫోన్ల తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్‌లో సుమారు 10 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. అయితే వీరంతా ఇప్పుడు టాటా గ్రూప్‌ ఉద్యోగులుగా మారనున్నారని తెలుస్తోంది. 
 
అయితే ఉద్యోగులపై టాటా సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా గ్రూపు అనేక రంగాలకు విస్తరిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టాటా ఎలక్ట్రానిక్స్‌ పేరుతో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ వైపు అడుగులు వేస్తోంది. టాటా సంస్థకు తమిళనాడు రాష్ట్రంలో వందల ఎకరాల్లో అతిపెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇందులో ఐఫోన్‌ ఛాసిస్‌ను తయారు చేస్తోంది. దీంతోపాటు చిప్‌ తయారీలోనూ గుర్తింపు తెచ్చుకుంది.
 
2024 మార్చి నాటికి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను సరఫరా చేయాలని విస్ట్రాన్‌ సంస్థ నిర్ణయించింది. అయితే ఐఫోన్ల తయారీ పగ్గాలు టాటాల చేతికి వచ్చిన నేపథ్యంలో ఆ హామీని టాటా గ్రూప్‌ కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్‌లో ఐఫోన్‌ 14 మోడల్‌ అసెంబ్లి జరుగుతుంది. 
 
సెప్టెంబర్‌ 12న ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను విడుదల చేసింది. విడుదల సమయంలో ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తాయి.
 
ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్‌ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ రూ.1,59,900గా ఉంది. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
 ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి. 
 
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి.