కర్ణాటక బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా పార్టీ దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తనయుడు విజయేంద్రను బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నియమించారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. నళిన్‌కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్ర కొత్త అధ్యక్షుడి పదవిలో నియమితులయ్యారు.
ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయేంద్ర గెలుపొందారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా 47 ఏళ్ల విజయేంద్ర నియామకం యెడియూరప్పకు రాజకీయ వారసత్వంగా భావిస్తున్నారు. మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూడటంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్నారంటూ కొద్దికాలంలో ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి.
2020నుంచి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర అధ్యక్షుడి స్థానంలో ఉన్న నళినీకుమార్ కటీల్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారనే ఊహాగానాలకు దీనితో తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర తన తండ్రి స్థానమైన శికారిపురనుంచి తొలిసారి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. న్యాయవిద్య పూర్తి చేసిన విజయేంద్ర గతంలో భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో మైసూరులో వరుణ నుంచి పోటీ చేసేందుకు విజయేంద్రకు పార్టీ టికెట్ నిరాకరించింది. అయితే, 2020 ఆగస్టులో ఆయన నాయకత్వంలో కేఆర్‌పేట, సిరా ఉపఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. శుక్రవారం పార్టీ అధ్యక్షుడిగా దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్ర బాధ్యతలు చేపట్టారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరునెలలు అవుతున్నా ఇంకా జరగని ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపి) నియామకం వచ్చే వారంబిజెపి శాసనసభా పక్ష సమావేశంలో జరుగుతుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన నియామకం తర్వాత, ఈ నియామకం గురించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జె. పి. నడ్డాతో చర్చించినట్లు చెప్పారు.
“వచ్చే శుక్రవారం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ప్రతిపక్ష నేత ఎన్నిక జరుగుతుంది. మేము మా ఎమ్యెల్యేల అందరి అభిప్రాయాన్ని తీసుకుంటాము. ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇద్దరు కేంద్ర పరిశీలకులు వచ్చే వారం బెంగళూరుకు వస్తారు” అని విజయేంద్ర తెలిపారు. అంతకుముందు తనకు ఇటువంటి “భారీ బాధ్యత” అప్పజెప్పినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సంస్థాగత కార్యదర్శి బీఎల్‌కు విజయేంద్రలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్ యడియూరప్ప, ఇతర సీనియర్ నేతల కృషి వల్లే బీజేపీ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి చేరుకుందని చెప్పారు.
“నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోన్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడమే నా లక్ష్యం. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా చూస్తాను. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతకు అవసరమైన చర్యలు తీసుకుంటాను’’ అని విజయేంద్ర తెలిపారు.
కాగా, యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. యువత పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించి కర్ణాటకలో బలాన్ని మరింతగా విస్తరింప చేసుకునేందుకు విజయంద్రను నియమించినట్లు కనిపిస్తున్నది. కొద్దీ నెలల క్రితమే రెండు తెలుగు రాస్త్రాలలో కూడా బిజెపి రాష్త్ర అధ్యక్షులను మార్చారు. ఆ తర్వాత దక్షిణాదిన కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడిని మార్చారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో దక్షిణాదిపై ప్రత్యేక వ్యూహంతో బిజెపి నాయకత్వం ముందడుగు వేస్తున్నట్లు ఈ నీయమకాలు స్పష్టం చేస్తున్నాయి.

More Stories
అస్సాం, బెంగాల్ ల్లో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అందరూ ముస్లింలే!
ఎన్నికల అనంతరం హింసలో సువేందు అధికారి పిఎ కాల్చివేత
ఎన్నికల అనంతరం హింసలో 200 ఎఫ్ఐఆర్ లు, అదుపులో 1500 మంది