ఢిల్లీలో కొద్దీ పాటి వర్షంతో స‌రి-బేసి విధానం నిర్ణయం

దాదాపు పది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న దేశ రాజధాని ఢిల్లీ వాసులకు గురువారం రాత్రి వరుణుడు కరుణించి ఊరటనిచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పెరిగిన వాయు కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. 
 
కర్తవ్య మార్గ్, ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఢిల్లీలో స‌రి-బేసి విధానం అమ‌లును వాయిదా వేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. న‌వంబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కు స‌రి-బేసి విధానంలో వాహ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌భుత్వం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 
 
అయితే కాలుష్యం స్థాయి త‌గ్గ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు మంత్రి రాయ్ తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇటీవ‌ల 450 ప‌స్ల్ ఉండేద‌ని, కానీ ఇప్పుడు ఆ ఎయిర్ క్వాలిటీ 300కు చేరుకుంద‌ని, దీని వ‌ల్లే స‌రి-బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అయితే దీపావ‌ళి త‌ర్వాత మ‌ళ్లీ స‌రి-బేసి విధానంపై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

నగరంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి మేఘ మథనం ద్వారా ‘కృత్రిమ వర్షం’ కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఐఐటీ కాన్పూర్ నిపుణులను సంప్రదించింది. ఈ సమయంలోనే హఠాత్తుగా వర్షం కురవడం పెద్ద ఊరట. మరోవైపు, కాలుష్య నిరోధక చర్యలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రులను కూడా రంగంలోకి దించింది.

తనిఖీ ప్రక్రియలో భాగంగా పలువురు ఢిల్లీ మంత్రులు గురువారం పొరుగు రాష్ట్రాలకు అనుసంధానించే వివిధ ప్రాంతాలు, సరిహద్దులను పరిశీలించారు. ప్రస్తుతం, నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఢిల్లీలో అమలవుతోంది. నగరంలో గాలి నాణ్యత అత్యంత తీవ్రమైన కేటగిరీకి పడిపోయింది.  వాయు కాలుష్య సూచీ (ఏక్యూఐ) వరుసగా ఏడో రోజు 400 దాటింది. అయితే, ఈ పరిస్థితి దీపావళి ముందు మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం తెలిపింది. ఐఎండీ చెప్పినట్టుగానే ఢిల్లీలో వర్షం కురిసి కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం లభించింది.

గురువారం ఢిల్లీలో ఏక్యూఐ 437గా నమోదైంది. బుధవారం (426)తో పోలిస్తే మరింత పెరిగింది. శివారులోని ఘాజియాబాద్‌ (391), గురుగ్రామ్‌ (404), నొయిడా (394), గ్రేటర్‌ నోయిడా (439), ఫరీదాబాద్‌ (410)ల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. నవంబరు 20, 21 తేదీల్లో మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 

పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధం, వాహన ఉద్గారాలు వంటి స్థానిక అంశాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచి తీవ్ర కేటగిరీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ మంత్రులు సమావేశమయ్యారు. కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. వివరణాత్మక ప్రణాళిక సమర్పించాలని ఐఐటీ బృందాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది.

కాగా, పాకిస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు దట్టంగా పొగమంచు కమ్ముకున్నట్లు నాసా గురువారం విడుదల చేసిన ఫోటోలు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో మాత్రమే ఎక్కువగా పొగమంచు ఉందని వివరించింది. ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ మరింత తీవ్రంగా ఉందని పేర్కొంది.