దీపావళి వేడుకల్లో కెనడా, బ్రిటన్ ప్రధానులు 

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రుడో ఆరోపణలతో భారత్‌- కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రుడో పాల్గొన్నారు. 
 
పార్లమెంట్‌ హిల్‌లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండో-కెనడియన్ పార్లమెంటేరియన్ చంద్రశేఖర్ ఆర్య ఆధ్వర్యంలో పార్లమెంట్‌ హిల్‌లో దీపావళి వేడుకలు జరిగాయి.
 
‘మరికొద్ది రోజుల్లో ప్రజలు దీపావళి, బండి చోర్‌ దివస్‌ జరుపుకుంటారు. ఈ రెండు వేడుకలు చెడుపై మంచికి చిహ్నాలు. ఈ వేడుకలు మనలో ఆశావాహ దృక్పథాన్ని నింపుతాయి. మన జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తాయి. ఈ వేడుకలు రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నా. అందరికీ దీపావళి, బండి చోర్‌ దివస్‌ శుభాకాంక్షలు’ అని ప్రధాని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.
 
ఒట్టావా, గ్రేటర్ టొరొంటో, మాంట్రియల్ వంటి నగరాల నుంచి ఈ వేడులకు పెద్ద ఎత్తున భారతీయులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన ఆర్య ఈ ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ పార్లమెంటు హిల్‌లో దీపావళి వేడుకలకు నిర్వహించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

యుకే ప్రధాని అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న డౌనింగ్‌ స్ట్రీట్‌లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి పాల్గొన్నారు. భార్య అక్షతా మూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. వేడుకలకు హాజరైన హిందూ అతిథులను ప్రధాని సునాక్‌ సాదరంగా ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని అధికారిక నివాసం దీపాల కాంతులతో మెరిసిపోయింది.  ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం స్పందించింది. చీకట్లపై వెలుగు విజయానికి సూచిగా జరుపుకునే దీపవళి వేడుకలను డౌనింగ్‌ స్ట్రీట్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా హిందూ కమ్యూనిటీకి చెందిన అతిథులను ప్రధాని రిషి సునాక్‌ ఆహ్వానించారంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అందులో అక్షతా మూర్తితో కలిసి ఆయన దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను షేర్‌ చేసింది. యూకేతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.