అత్యధిక ఉష్ణోగ్రతల వేడిమి సంవత్సరంగా 2023

2023 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతల వేడిమి సంవత్సరంగా మిగలనుంది. గడిచిన 1,25,000 సంవత్సరాలలో 2023 ఏడాదే అత్యంత వార్మెస్ట్ ఇయర్‌గా నిలచిందని యూరప్ దేశాలకు చెందిన పర్యావరణవేత్తలు నిర్థారించారు. ఈ ఏడాది వేసవి తీవ్రత ప్రభావాన్ని జనం చివరికి వర్షాకాలంలోనూ ఇప్పటి శీతాకాలంలోనూ అనుభవిస్తున్నారు.

 శిలాజ ఇంధనాల దగ్థం, సముద్ర ఉపరితల వేడిమి పరిణామాలు ఈ అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుకు దారితీశాయి. ప్రత్యేకించి విపరీత స్థాయిలో వేడిగాలులు వాతావరణంలోకి చేరుకున్నాయి. అక్టోబర్ నెల తర్వాత ఇప్పటి వరకు ఈ ఏడాది నమోదు అయిన సగటు ఉష్ణోగ్రతలను లెక్కిలోకి తీసుకుంటే ఈ ఏడాది అత్యంత వేడిమి సంవత్సరంగా రికార్డులోకి చేరనుంది. 

నవంబర్ లో జరుగనున్న కీలకమైన వాతావరణ సదస్సులో  2023 సంవత్సరపు పరిణామంపై విశ్లేషణలు సాగుతాయని భావిస్తున్నారు. కోపర్నికస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాస్త్రజ్ఞులు ఓ అధ్యయన నివేదికను వెలువరించారు. ఇందులో ఈ ఏడాది అక్టోబర్ తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నెలగా నిర్థారించారు. సాధారణంగా అక్టోబర్‌లో ఉండాల్సిన దీర్థకాల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇది 0.8 డిగ్రీలు ఎక్కువగా ఉంది. 

అంతకు ముందటి సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగినట్లుగా గుర్తించారు. ఇక మిగిలిన డిసెంబర్ నెలను కూడా లెక్కకట్టుకుని చూస్తే ఈ ఏడాది తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల ఇయర్‌గా ఉంటుందని విశ్లేషించారు. ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాయు వేడిమి, చివరికి సముద్రపు మంచు కరిగిపోవడం వంటివి చకచకా జరిగిపోతూ ఓ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయని ఎడిన్‌బరో వర్శిటీకి చెందిన సైంటిస్టు డేవిడ్ రియాయె వ్యాఖ్యానించారు. 

ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నిర్థారించారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు ఏప్రిల్‌, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది.

 ‘జూలై-ఆగస్టులో ఎల్‌నినో మార్పులు వేగాన్ని అందుకున్నాయి. నవంబర్‌లో బలంగా మారి, జనవరి 2024 నాటికి ఎల్‌నినో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఉత్తరార్థ గోళంలో శీతాకాలంలో, దక్షిణార్థ గోళంలో వేసవికాలంలో ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే అవకాశం 90 శాతం వరకు ఉన్నాయి’ అని డబ్ల్యూఎంవో తన అంచనాల్ని విడుదల చేసింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలపై ఉంటుందని తెలిపింది. 

అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డ్‌ సృష్టించగా, 2024లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసింది. అత్యంత వేడిగాలులు, కరువు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చు, హఠాత్తుగా కుండపోత వర్షాలు..కొన్ని ప్రాంతాల్ని చుట్టుముడుతాయని పేర్కొన్నది.