గాజాలో రోజుకు సగటున 160 మంది చిన్నారుల మృతి

ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమవుతున్న గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడ రోజుకు సగటున 160 మంది చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో యుద్ధం మొదలై నెలరోజులైంది. 

అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధంలో ఇంతవరకు 10 వేలమందికి పైగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాకుంఢా, క్షతగాత్రులను ఆదుకునేందుకు గాజా ప్రాంతంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లలో 16 మంది కూడా బాంబు దాడులకు బలైపోయారట. ఆసుపత్రులు, సంబంధిత సంస్థలపై 102కి పైగా దాడులు జరిగాయి.

గాజా చిన్నారులకు శ్మశాన వాటికలా మారుతోందని పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా పరిస్థితి మానవతా సంక్షోభం కంటే ఎక్కువ అని, ఇది మానవత్వం సంక్షోభమని చెబుతూ  కాల్పుల విరమణ అవసరమని.. ప్రతి గంటకు మరింత అత్యవసరమని స్పష్టం చేశారు.

 అంతర్జాతీయ సమాజం గాజాలో అమానవీయ ఘటనలను ఆపాలని, అలాగే మానవతా సహాయాన్ని విస్తరించాల్సిన బాధ్యత ఉందని ఆయన పిలుపిచ్చారు. ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న 89 మంది మరణించారని యూఎన్‌ చీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

యూఎన్‌ చరిత్రలో ఇటీవల వారాల్లో అత్యధిక సంఖ్యలో యూఎన్‌ కార్యకర్తలు చంపబడ్డారని పేర్కొన్నారు. యుద్ధంలో కనీసం 26 మంది వరకు గాయపడ్డారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు.

ప్రస్తుతం గాజాలో 14 ఆస్పత్రులు బాంబు దాడుల్లో ధ్వంసం కావడంవల్లనో లేక వనరుల లేమి కారణంగానో పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మీయర్ తెలిపారు. నీళ్లు, ఇంధనం, ఆహారం దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని, వైద్య సేవలు మృగ్యమైపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు డాక్టర్లు రోగులకు అనస్తీషియా ఇవ్వకుండానే శస్త్రచికిత్సలు చేయవలసిన పరిస్థితి నెలకొని ఉందన్నారు.

గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం యుద్ధం మొదలయ్యాక, ఇప్పటివరకు 10,328 మంది మరణించగా, 24,408మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో 67 శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. మరో 2450మంది కనిపించకుండా పోయారు.

ఇలా ఉండగా, యుద్ధం వల్ల గాజా నగరంలో ఇప్పటివరకు 60 శాతానికిపైగా మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. గాజాపై ఇజ్రాయిల్  దాడులు ప్రారంభించడంతో పాలస్తీనా భూభాగంలో మొత్తం లక్షా 82 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐఎల్‌ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జీవనోపాధి కోల్పోవడంతో దాదాపు సగంమంది పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్నారని వెల్లడించింది.

మరోవైపు, మంగ‌ళ‌వారం రాత్రి ఇజ్రాయెల్ ద‌ళాల దాడుల్లో హ‌మాస్ ఆయుధాల త‌యారీ విభాగాధిప‌తి ముహ్సిన్ అబు జినాను మ‌ట్టుబెట్టామ‌ని ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా ద‌ళాలు (ఐడీఎఫ్‌) వెల్ల‌డించాయి. వ్యూహాత్మ‌క ఆయుధాలు, రాకెట్ల త‌యారీలో జినా సిద్ధ‌హ‌స్తుడ‌ని ఐడీఎఫ్ తెలిపింది. హ‌మాస్ ల‌క్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం పురోగ‌మిస్తోంద‌ని హ‌మాస్‌ను రూపుమాపే దిశ‌గా సాగుతోంద‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెతన్యాహు స్ప‌ష్టం చేశారు. పాల‌స్తీనా మిలిటెంట్ గ్రూప్ చెర‌లో ఉన్న వారంద‌రినీ విడిపించేంత‌వ‌ర‌కూ ఎలాంటి సంధి ప్ర‌య‌త్నాల ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పారు.