అసెంబ్లీలో మహిళలకు నితీష్ క్ష‌మాప‌ణ‌లు

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసెంబ్లీలో క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. చ‌దువుకున్న మ‌హిళ‌లను కించ‌ప‌రిచేలా అసెంబ్లీలో చేసిన వాఖ్యల ప‌ట్ల ఆయ‌న బుధవారం క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాలు  నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు సీఎం నితీశ్ తెలిపారు.
“నేను నా మాటలను వెనక్కి తీసుకున్నా. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. స్త్రీ విద్య గురించి నేను మాట్లాడాను. కామెంట్స్ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. క్షమించండి” అని నితీశ్ చెప్పారు.
 
జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో మ‌హిళా పాత్ర కీల‌క‌మైంద‌ని, ఈ నేప‌థ్యంలో సెక్స్ ఎడ్యుకేష‌న్ అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పున‌రుత్ప‌త్తి రేటు త‌గ్గిన అంశం గురించి స‌భ‌లో చ‌ర్చిస్తూ భార్య చ‌దువుకున్న‌దైతే గ‌ర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుంద‌ని సీఎం నితీశ్ పేర్కొన్నారు. 
 
కుల గ‌ణ‌న రిపోర్టును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత సీఎం నితీశ్ ఆ అంశంపై మాట్లాడుతూ సెక్స్ ఎడ్యుకేష‌న్ గురించి కూడా కొన్ని కామెంట్లు చేశారు. శృంగారం వ‌ల్ల గ‌ర్భం దాల్చుకుండా ఎలా ఉండాల‌న్న విష‌యం చ‌దువుకున్న మ‌హిళ‌ల‌కు తెలుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ విష‌యాన్ని నొక్కి చెప్పేందుకు ఆయ‌న కొంత ఘాటు భాష‌ను వాడారు.
 
 చ‌దువుకున్న మ‌హిళ‌ల వ‌ల్ల జ‌నాభా నియంత్ర‌ణ జ‌రుగుతుంద‌ని ఆయ‌న త‌న ప్ర‌సంగంలో తెలిపారు.  బీహార్‌లో ఫెర్టిలిటీ రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి ప‌డిపోయింద‌ని రిపోర్టులో ఉన్న విష‌యాన్ని నితీశ్ స‌భ‌లో తెలిపారు. అయితే నితీశ్ చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర దుమారం చెల‌రేగుతోంది.
 
నితీశ్‌ వాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు కాముకత, స్త్రీ ద్వేషంతో కూడినవని.. మహిళలను తీవ్ర అవమానించేలా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్‌ వాడిన ‘పదజాలం’పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నితీశ్‌ ‘ఓ అసభ్యకరమైన నాయకుడు’ అని, ఇలాంటి వ్యక్తి భారత రాజకీయాల్లో మరొకరు కనిపించరని తూర్పారబట్టింది. 
 
మహిళలు విద్యావంతులైతే జనాభా అదుపులో ఉంటుందనే సందేశాన్ని నితీశ్‌ ‘అభ్యంతరకరమైన తీరు’లో కాకుండా చక్కని మాటలతో చెప్పాల్సిందని బీజేపీ నేత తారా కిషోర్‌ ప్రసాద్‌ తెలిపారు. నితీశ్‌ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేయడంతో బుధవారం బిహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. చాలా నీచ‌మైన భాష‌ను సీఎం నితీశ్ వాడార‌ని ప్ర‌తిప‌క్ష బీజేపీ ఆరోపించింది.
 
అయితే, ఉప ముఖ్యమంత్రి తేజ‌స్వియాద‌వ్ మాత్రం నితీశ్‌ను స‌మ‌ర్ధించారు.  నితీశ్‌ మాటలను లైంగిక విద్య కోణంలోనే చూడాలని కోరారు.  సీఎం నితీశ్ కుమార్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జాతీయ మ‌హిళా క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్ కూడా డిమాండ్ చేశారు. విధాన స‌భ‌లో మ‌హిళ‌ల గురించి వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌హిళ‌ల్ని అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని ఆమె అసహనం వ్యక్తం చేశారు.