`ఇండియా’ నేతలకు దేశంలోని మహిళల పట్ల చులకన భావం 

ఇప్పుడు అయోమయంగా అవతరించి కుంటుతోన్న ప్రతిపక్ష కూటమి `ఇండియా’ నేతలకు దేశంలోని మహిళల పట్ల చులకన భావం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. బీహార్ ముఖ్యమంత్రి, `ఇండియా’ కూటమి నేత నితీశ్‌ కుమార్ ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని గుణలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో విరుచుకుపడ్డారు. 
 
ఓ నేత ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలోనే మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలకు దిగారని, అయితే ఇంతవరకూ ప్రతిపక్ష కూటమి వారి నుంచి దీనిపై ఎటువంటి ఖండనలు వెలువడలేదని, ఇది `ఇండియా’ కూటమిలోని నేతలకు మహిళల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని విమర్శించారు. నిండుసభలో ఆడపడుచులు, సోదరీల పట్ల ఇష్టం వచ్చిన భాషను వాడారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
చివరికి ఎవరూ తమ మనస్సుల్లోకి కూడా ఇటువంటి మాటలు రావని చెబుతూ వీటిని బహిరంగంగా వెల్లడించి మహిళలను అమానించిన ఈ వ్యక్తికి సిగ్గన్పించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించకుండా ఉన్న ఇతర ప్రతిపక్ష నేతలకు కూడా మహిళల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలిసివస్తోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద ప్రజల రేషన్‌ను అడ్డుకుంటుందా? చివరికి ఈ పార్టీ నేతలు ఈ పాపం కూడా మూటగట్టుకుంటారా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ టౌన్‌లో ఆయన బుధవారం ఎన్నికల సభలో ప్రసంగిస్తూ నిరుపేదలకు ఇప్పుడున్న రేషన్ సరుకుల పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తామని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. 

పేదలకు రేషన్ ఇస్తామనితాము అంటున్నామని, దీనిని అడ్డుకుంటామని కాంగ్రెస్ చెపుతోందని చెబుతూ ఈ పాపం కూడా వారు చేయనివ్వండి, ఇటువంటి వాటికి భయపడేది లేదని, ప్రజలకు మంచి చేసేందుకు తాము పాటుపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.  దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఇప్పుడున్న రేషన్ పథకం ఇక ముందు కూడా కొనసాగుతుందని , దీనిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని గుణ సభలో ప్రధాని స్పష్టం చేశారు.

తనను ఎవరు ఎన్ని విధాలుగా తిట్టినా తానులెక్కచేసేది లేదని, అవినీతిపరుల పనిపడుతామని ప్రధాని ప్రకటించారు. ప్రజలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, మరి అక్కడ ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసివచ్చిందని పేర్కొన్నారు. అక్కడి కాంగ్రెస్ సిఎంలు పూర్తిగా దిగజారి చివరికి సత్తా కోసం సట్టాలకు అంటే బెట్టింగ్‌లకు దిగుతూ, ఇటువంటి యాప్స్ వారికి సహకరిస్తూ వారి నుంచి పెద్ద ఎత్తున నల్లధనం నొక్కేస్తున్నారని మోదీ ఆరోపించారు. 

ఈ విధంగా అందిన సొమ్మును ఎన్నికలలో అక్రమరీతిలో గెలిచేందుకు వాడుతున్నారని, ఇదో అవినీతి విషవలయం అయిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారేందుకు ముందుకు దూసుకుపోతోందని స్పష్టం చేశారు. దేశాన్ని 200 ఏండ్లు పాలించిన బ్రిటన్‌ను వెనకకు నెట్టి ఇప్పుడు భారతదేశం క్రమేపీ ఐదో ఆర్థిక శక్తిగా మారిందని తెలిపారు.

ఇప్పుడు ప్రధానిగా తమ మూడో పదవీకాల హయాంలో దేశాన్ని మూడు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల దేశాల జాబితాల్లోకి తీసుకువెళ్లుతామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాలలో 85 శాతం కమిషన్ల దందాల పద్థతి వస్తుందని, ఈ విషయం తాను చెప్పడం లేదని, ఆ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి ఓ దశలో తెలియచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు కమిషన్ల పాలనకు చాలా లింక్ ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును లూఠీ చేసిందని, అందుకే వారి హయాంలో దేశం ముందుకు వెళ్లలేదని విమర్శించారు.