బౌలింగ్ లో సిరాజ్, బ్యాటింగ్ లో గిల్ టాప్

ఇండియ‌న్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌, బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌లు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందారు. బ్యాటింగ్‌లో గిల్‌, బౌలింగ్‌లో సిరాజ్‌లు నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. తాజాగా ఐసీసీ త‌న ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.
 
 చాన్నాళ్లుగా బ్యాటింగ్‌లో టాప్‌లో ఉన్న బాబ‌ర్ ఆజ‌మ్ ర్యాంకు ప‌డిపోయింది. బాబ‌ర్‌ను వెన‌క్కి నెట్టేసి గిల్ తొలి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇటీవ‌ల మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ ఆ స్థానాన్ని ఆక్ర‌మించిన నాలుగ‌వ ఇండియ‌న్ బ్యాట‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ మాత్ర‌మే నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ స్థానాన్ని ఆక్ర‌మించారు.
 
ప్రపంచ కప్ లో గిల్ కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. శ్రీలంక‌తో 92, సౌతాఫ్రికాతో 23 ర‌న్స్ చేశాడు. టోర్నీలోని ఆరు మ్యాచుల్లో అత‌ను 219 ర‌న్స్ చేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన గిల్ 282 ర‌న్స్ చేశాడు. అయితే రెండున్న‌ర ఏళ్లుగా వ‌న్డే టాప్ బ్యాట‌ర్ జాబితాలో ఉన్న బాబ‌ర్ త‌న స్థానాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. 
 
రెండో స్థానంలో ఉన్న గిల్ ఆ ప్లేస్‌ను ఆక్ర‌మించేశాడు. బ్యాట‌ర్ల‌లో మూడు పాయింట్లు ముందుకు దూకిన కోహ్లీ ప్ర‌స్తుతం నాలుగ‌వ స్థానంలో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికాకు చెందిన క్వింట‌న్ డికాక్ మూడ‌వ స్థానంలో నిలిచాడు.
 
గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా, బాబర్ ఆజమ్ (824 పాయిట్లు), క్వింటన్ డికాక్ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఆప్గనిస్తాన్ ఓపెనర్ జద్రాన్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇక భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 18వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, బౌల‌ర్ల‌లో సిరాజ్ అగ్ర స్థానంలో నిలిచాడు. తాజాగా జ‌రుగుతున్న ప్రపంచ కప్ లో అత‌ను ఇప్ప‌టికే 10 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. రెండు స్థానాల్లో ఇంప్రూవ్ అయిన సిరాజ్‌ వ‌న్డేల్లో నెవంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ అయ్యాడు. కుల్దీప్ యాద‌వ్ నాలుగ‌వ స్థానంలో ఉన్నాడు. బుమ్రా 8వ‌, ష‌మీ 10వ స్థానంలో నిలిచారు.

బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 709 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 694 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా (662), భారత స్పిన్నర్ కులదీప్ (661), పాక్ పేసర్ షహీద్ అఫ్రీదీ (658) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.