డిసెంబర్ రెండో వారంలో పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం రెండో వారంలో పార్లమెంట్ సమావేశాలు మొదలై క్రిస్మస్‌ పండుగకు ముందు ముగియగలవని పార్లమెంట్‌ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూడు నివేదికలకు హోం కమిటీ ఆమోదం లభించింది. 

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడంతో బిల్లు ఆమోదం పొందలేదు. 

శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడో వారంలో ప్రారంభమై డిసెంబర్ 25లోపు ముగుస్తాయి. కానీ ఎన్నికల కారణంగా ఈ సారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ఫలితాల అనంతరం జరుగనున్న సమావేశాలు కావడంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.