మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలి

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీలతో కూడిన తుది నివేదికను రూపొందించింది.

మొయిత్రా అనైతిక వ్యవహారంపై భారత ప్రభుత్వం న్యాయ, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని అందులో పేర్కొంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 2న కమిటీ ముందు హాజరయ్యారు.

మహువా మొయిత్రా అనధికారిక వ్యక్తులతో యూజర్ ఐడిని పంచుకున్నారని, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదుతో పాటు ప్రయోజనాలు పొందారని, ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన అని కమిటీ నిర్ధారించింది. ‘క్విడ్ ప్రోకో’లో భాగంగా మహువా మెయిత్రా, దర్శన్ హీరానందానీల మధ్య నగదు లావాదేవీలపై భారత ప్రభుత్వం చట్టపరమైన, సంస్థాగత, సయయానుకూల పద్ధతిలో దర్యాప్తు చేయాలి’ అని నివేదిక పేర్కొంది.

బీజేపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షుడిగా ఉన్న నైతిక విలువల కమిటీ దర్శన్ హీరానందనితో మెయిత్రా వ్యక్తిగత సంబంధాలపై దృష్టి సారించింది. సీబీఐకు ఫిర్యాదు చేసిన జై అనంత్ దేహద్రాయ్‌ అంశం కూడా ఇందులో ఉంది. విచారణకు మెయిత్రా సహకరించడంలో విఫలమయ్యారని కమిటీ ఆరోపించింది. ‘మహువా మొయిత్రా కమిటీ విచారణకు సహకరించలేదు. ప్రతిపక్ష సభ్యులు కూడా కోపంతో ఆరోపణలు చేశారు.. మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండటానికి సమావేశం నుంచి అకస్మాత్తుగా వాకౌట్ చేశారు’ సోంకర్ చెప్పారు.

నగదు, బహుమతులకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని మధ్య లంచం మార్పిడి జరిగిందని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ రాసిన లేఖను ఆయన ఉదహరించారు. 

కాగా, ఈ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించనున్నారు. దీనిపై లోక్‌సభలో చర్చను చేపట్టిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వీటన్నింటినీ మహువా ఖండించారు. ఎంపీ నిషికాంత్ దూబే, జై అనంత్‌కు ఆమె ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు.

మరోవైపు, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విషయంలో తాను చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు లోక్‌పాల్‌ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే బుధవారం వెల్లడించారు. ‘జాతీయ భద్రతను పణంగా పెట్టిన అవినీతి వ్యవహారంలో మొయిత్రాపై సీబీఐ దర్యాప్తునకు ఈ రోజు లోక్‌పాల్‌ ఆదేశించింది’ అని ట్వీట్ చేశారు. అయితే, దూబే ప్రకటనపై స్పందించిన మొయిత్రా.. లోక్‌పాల్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని అన్నారు. అంతేకాదు, అదానీ గ్రూప్‌ బొగ్గు కుంభకోణం ఆరోపణలపై మొదటగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.