భార‌త్ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసిన ల‌ష్క‌రే మాజీ క‌మాండ‌ర్ హ‌తం

గ‌తంలో భార‌త్ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసిన ల‌ష్క‌రే తోయిబా మాజీ క‌మాండ‌ర్ అక్రం ఘ‌జిగా పేరొందిన అక్రం ఖాన్‌ను పాకిస్తాన్ లోని బ‌జౌర్ జిల్లాలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు హ‌త‌మార్చారు. భారత్ హిట్ లిస్ట్‌లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు వారం వ్యవధిలోనే హతమవడం గమనార్హం.  గతవారం సుంజ్వాన్ ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన ఖ్వాజా షాహిద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. నియంత్రణ రేఖకు సమీపంలో పీఓకే వద్ద శిరచ్ఛేదం చేసిన విషయం తెలిసిందే.
అక్రమ్ ఖాన్ అలియాస్ ఘాజీ 2018-2020 మధ్యకాలంలో లష్కరే రిక్రూటర్లలో కీలకంగా ఉన్నాడు.  గత రెండేళ్లలో కశ్మీర్ లోయలోకి అనేక బ్యాచ్‌లుగా చొరబడిన చాలా మందిని ఉగ్రవాదులుగా మార్చడంలో ముఖ్య బాధ్యత వహించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2018 నుంచి 2020 వ‌ర‌కూ ల‌ష్క‌రే రిక్రూట్‌మెంట్ విభాగానికి నేతృత్వం వ‌హించిన అక్రం ఖాన్ పాకిస్తాన్‌లో భార‌త్ వ్య‌తిరేక ప్ర‌సంగాల‌తో పేరొందాడు.  
 
ఉగ్ర సంస్ధ నాయ‌క‌త్వంలో అగ్ర‌భాగాన ఉన్న అక్రం ఖాన్ దీర్ఘ‌కాలంగా ఉగ్ర కార్య‌క‌లాపాల్లో నిమగ్న‌మ‌య్యాడు. కాగా,  సెప్టెంబరులో పీఓకేలోని రావాలకోట్‌లోని అల్ ఖుద్దూస్ మసీదు వెలుపల లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. పీఓకేలో లష్కర్ రిక్రూట్‌మెంట్‌ను బాధ్యతలను నిర్వహించే ఖుద్దూస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తాజాగా, ఘాజీ హత్య లష్కరే, ఐఎస్ఐకి మరో పెద్ద ఎదురుదెబ్బ.
 

ఈ ఘటన వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్యను గుర్తుచేస్తుంది. అతడు గత మేలో లాహోర్‌లోని తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఉగ్రవాదుల వరుస హత్యలు పాక్‌ను కలవరానికి గురిచేస్తున్నాయి.  కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో మౌలానా జియావుర్ రెహ్మాన్, గుల్షన్-ఇ-ఉమర్ సెమినరీలో ముఫ్తీ ఖైజర్ ఫరూక్ అనే ఇద్దరు లష్కరే కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

 
అలాగే, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి సూత్రధారి, జైషే మొహమ్మద్ ఉగ్రవాది షాహిద్ లతీప్‌‌ను కూడా అక్టోబరు 10న పాక్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత 20 నెలల్లో భారత్‌పై కుట్రలు చేసిన 18 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో మృతి చెందడం గమనార్హం.