యుద్ధం కొనసాగితే పాలస్తీనాలో 34 శాతానికి పేదరికం

యుద్ధం కొనసాగితే పాలస్తీనాలో 34 శాతానికి పేదరికం

ఇజ్రాయిల్‌ – హమాస్ యుద్ధం కొనసాగితే పాలస్తీనాలో పేదరికం గణనీయంగా పెరుగుతుందని ఐరాస పేర్కొంది. రెండవ నెల కూడా గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగితే పాలస్తీనాలో పేదరికం రేటు 34 శాతానికి చేరుకుంటుందని తెలిపింది.  అక్టోబర్ 7 నుండి ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే. 

ఐరాస డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి), ఎకనామిక్‌, సోషల్‌ కమిషన్‌ ఫర్‌ పశ్చిమ ఆసియా (ఇఎస్‌సిడబ్ల్యుఎ) సంయుక్తంగా  ఓ నివేదికను విడుదల చేశాయి. ” గాజా యుద్ధం : పాలస్తీనాపై సామాజిక – ఆర్థిక ప్రభావం ” పేరుతో విడుదలైన ఈనివేదికలో పలు అంశాలను చర్చించాయి.

34 శాతం, దాదాపు ఐదు లక్షలకు పైగా పాలస్తీనియన్లు పేదరికంలోకి వెళతారని తెలిపింది. పాలస్తీనా జిడిపి 8.4 శాతానికి క్షీణిస్తుందని, 1.7 బిలియన్‌ అమెరికా డాలర్ల నష్టమని యుఎన్‌డిపి, ఇఎస్‌సిడబ్ల్యుఎ అంచనా వేశాయి. నెలరోజుల యుద్ధం ప్రభావంతో పేదరికం రేటు 20 శాతం పెరగగా, ఆర్థిక వృద్ధి రేటు 4.2 శాతం క్షీణించిందని సూచించింది. 

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నివేదిక ప్రకారం ఈ సమయంలోనే 3,90,000 మంది ఉద్యోగాలను కోల్పోయారని పేర్కొంది. యుద్ధం మూడవ నెలకు చేరితే పేదరికం 45 శాతానికి చేరుతుందని, దీంతో 6,60,000 మంది పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించింది. 

అదే సమయంలో జిడిపి 12.2 శాతానికి పడిపోగా, మొత్తం 2.5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నష్టం ఏర్పడవచ్చని అంచనా వేశాయి. మానవ అభివృద్ధి సూచిలో గణనీయమైన క్షీణత కనిపిస్తుందని హెచ్చరించింది. యుద్ధం తీవ్రతను అనుసరించి పాలస్తీనాలో అభివృద్ధి 11 నుండి 16 సంవత్సరాల వెనక్కు, గాజాలో 16 నుండి 19 సంవత్సరాల వెనక్కు చేరుతుందని హెచ్చరించింది.

అక్టోబర్‌ 7 నుండి సుమారు 1.5 మిలియన్ల మంది నిరాశ్రయులవగా, భారీగా నివాసాలు, మౌలిక సదుపాయాల నష్టం ఏర్పడిందని నివేదిక పేర్కొంది. ఆర్థికమాంద్యం విపత్తు మానవతా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని, రికవరీ అవకాశాలు సవాలుగా మారతాయని తెలిపింది.

ఇలా ఉండగా, పాలస్తీనా భూభాగమైన గాజాని పరిపాలించాలని కోరుకోవడం లేదని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. గాజా భూభాగాన్ని పరిపాలించాలని తాను భావించడం లేదని, ఆక్రమించాలనుకోవడం లేదని, కానీ గాజాకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు.
 
గాజా నుండి ఎవరినీ వెళ్లగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. పేదరికంలో, దిగ్బంధంలో ఉన్న భూభాగం నుండి సైన్యాన్ని ఉపసంహరించాలని, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, తిరిగి పునర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాలో పౌర ప్రభుత్వాన్ని నియమించాలని అయితే ఆ ప్రభుత్వాన్ని ఎవరు నియమిస్తారన్న అంశాన్ని దాటవేశారు. ఏదేమైనా, గాజాలో హమాస్‌ వంటి ఉగ్రవాద సంస్థలు తిరిగి రాకుండా నిలువరిస్తామని తేల్చి చెప్పారు.