నేను భారతీయురాలినైతే.. బీహార్‌ సీఎంగా పోటీ చేసేదాన్ని

* మోదీపై ప్రశంసల జల్లు
మహిళలను ఉద్దేశించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం ముగియడం లేదు. బుధవారం నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా, తాజాగా అమెరికా సింగర్ ఒకరు స్పందించారు. 
 
తాను భారతీయురాలిని అయితే బిహార్‌కు వెళ్లి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసేదాన్ని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై  అమెరికా సింగర్, నటి మేరీ మిల్‌బెన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ జీ వ్యాఖ్యల తర్వాత.. ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాలి. బీహార్‌ ముఖ్యమంత్రిగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలి’ అంటూ ఆమె అభిలాషను వ్యక్తం చేశారు. 
 
ఆయన చేసిన వ్యాఖ్యలకు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని మేరీ మిల్‌బెన్ డిమాండ్ చేశారు. బిహార్‌లో మహిళల విలువలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని చెబుతూనితీష్ కుమార్ వ్యాఖ్యలు విన్న తర్వాత మహిళలకు ఎదురవుతున్న ఇలాంటి సవాళ్లకు తనకు ఒకే ఒక సమాధానం కనిపిస్తోందని ఆమె తెలిపారు. బిహార్‌లో ఒక ధైర్యవంతురాలైన మహిళ ముఖ్యమంత్రిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా భారతీయ మహిళలకు మేరీ మిల్‌బెన్ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మహిళల కోసం ఓటు వేయాలన, మార్పును ఆహ్వానించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మిల్‌బెన్ ప్రశంసలు గుప్పించారు. బిహార్‌లో మహిళల అధికారం దిశగా బీజేపీ అడుగులు వేయాలని ఆమె సూచించారు.  అదే నిజమైన అభివృద్ధ అని మిల్‌బెన్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోనే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని ఆమె చెప్పారు. `బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని నేను కోరుతున్నా. జవాన్‌ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ చెప్పినట్టు ఓటు వేసి మార్పు తీసుకురావాలి’ అని ఆమె పేర్కొన్నారు. భారత్‌కు ఉత్తమ నాయకుడు ప్రధాని మోదీ అని, మహిళలకు మద్ధతుగా నిలబడ్డారని కొనియాడారు. అమెరికా – భారత్ బంధానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు.
మోదీకి ఎందుకు మద్ధతిస్తున్నావని, భారత్‌కు సంబంధించిన అంశాలను ఎందుకు తెలుసుకుంటావని తనను చాలా మంది అడుగుతున్నారని ఆమె తెలిపారు. అలాంటి వారందరికీ ‘ఐ లవ్ ఇండియా’ అనే సమాధానం ఇస్తున్నానని ఆమె చెప్పారు. భారత్‌కు ఉత్తమ నాయకుడు ప్రధాని మోదీయేనని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
 
ఇటీవల బీహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్‌ మాట్లాడుతూ ‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తన భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని మాట్లాడారు. 
 
అయితే, ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం కావటంతో సీఎం నితీశ్‌కుమార్‌ బుధవారం నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ‘నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు తెలుపుతున్నా. జనాభా నియంత్రణలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పటం నా ఉద్దేశం. అంతే తప్ప..ఎవర్నో కించపర్చాలన్నది నా ఉద్దేశం కాదు’ అంటూ నితీశ్‌ వివరణ ఇచ్చుకున్నారు.