ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణలో జాప్యంపై `సుప్రీం’ అసహనం

ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.  ఆయా కేసుల విచారణ వేగంగా జరిగేలా చూడాలని, అవి వేగంగా విచారణ జరిగేలా, వాటిపై పర్యవేక్షణ కోసం స్వయంగా ఒక సుమోటు కేసు రిజిస్టర్ చేయాలని హైకోర్టులకు సూచించింది.

వివిధ రాష్ట్రాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదై ఉన్న క్రిమినల్ కేసులను వేగవంతంగా విచారించడానికి సంబంధించి దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులకు ఒక ఏకీకృత నిబంధనావళిని జారీ చేయడం సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీపీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పని ఆయా రాష్ట్రాల హైకోర్టులే చేయాలని సూచించింది. 

రాష్ట్రంలో విచారణ జరుగుతున్న ఆయా కేసుల పర్యవేక్షణకు హైకోర్టులు స్వయంగా “In Re Designated Courts for MPs and MLAs” పేరుతో ఒక సుమోటు కేసు రిజిస్టర్ చేయాలని హైకోర్టులకు సూచించింది. ఆ సుమోటు కేసును ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం లేదా ఆ చీఫ్ జస్టిస్ సూచించిన జడ్జి నేతృత్వంలోని బెంచ్ విచారించాలని సూచించింది.

 ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదై ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల విచారణ వేగంగా జరిగేలా ఆ బెంచ్ బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అందుకు అవసరమైతే, ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సహాయం తీసుకోవాలని పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు వాటి తీవ్రతను బట్టి ప్రాధాన్యతను ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. 

మరణ శిక్ష పడే అవకాశమున్న తీవ్రత కలిగిన కేసులను తొలుత విచారించాలని, ఆ తరువాత ఐదేళ్లు ఆపై జైలు శిక్ష పడే కేసులను విచారించాలని ఆదేశించింది. సరైన కారణం లేకుండా ఆయా కేసుల విచారణను వాయిదా వేయకూడదని ట్రయల్ కోర్టులను ఆదేశించింది. 

జిల్లాల వారీగా జరుగుతున్న కేసుల విచారణ ప్రగతిని ఆయా జిల్లాల డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నుంచి రెగ్యులర్ గా తెలుసుకోవాలని ఆదేశించింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌‌‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు ఏర్పాటయ్యేలా ఆయా జిల్లాల డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ వేసిన పిల్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు, ఈడీ, సీబీఐ, సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది. తమ వద్ద 51 మాజీ, ప్రస్తుత ఎంపీలు, 71 మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలపై కేసులు నమోదై ఉన్నాయని ఈడీ తెలిపింది. అలాగే, తమ వద్ద మాజీ, ప్రస్తుత ఎమెల్యేలు, ఎంపీలపై మొత్తం 121 కేసులు విచారణ దశలో ఉన్నాయని సీబీఐ వెల్లడించింది.

కాగా, ఎవరైనా ప్రజాప్రతినిధిపై తీవ్ర నేరాలను సంబంధించి అభియోగం నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.