ఢిల్లీలో ప్ర‌మాద‌స్ధాయిలో వాయు కాలుష్యం.. మళ్లీ సరి, బేసి విధానం

దీపావ‌ళికి ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్ధాయికి చేర‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. న‌వంబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కూ వాహ‌నాల రాక‌పోక‌ల‌కు సంబంధించి మ‌ళ్లీ స‌రి-బేసి విధానం అమ‌లుకానుంది. మ‌రోవైపు నిర్మాణ ప‌నుల‌కు బ్రేక్ ఇవ్వ‌డంతో పాటు 10, 12 త‌ర‌గ‌తులు మిన‌హా మిగిలిన త‌ర‌గ‌తుల‌ను న‌వంబ‌ర్ 10 వ‌ర‌కూ నిలిపివేశారు. 
 
ఇక సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి 437గా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గినా ఇంకా ప్ర‌మాద‌క‌ర స్ధాయిలోనే ఉంది. అంత‌కుముందు వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్‌, ఇతర శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్‌-4 గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలుపై చర్చించిన అనంత‌రం స‌రి-బేసి విధానాన్ని తిరిగి అమ‌లు చేయాల‌ని, స్కూళ్ల‌ను ఈనెల 10 వ‌ర‌కూ మూసివేయాల‌ని నిర్ణ‌యించారు. 
 
వాయు కాలుష్య నియంత్ర‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ఈ భేటీలో విస్తృతంగా చ‌ర్చించారు. ఇక, గతవారం రోజులుగా ఢిల్లీని విషపూరిత కాలుష్యం దుప్పటిటా కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో దశ కార్యాచరణ ప్లాన్‌ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అత్యవసర సేవల వాహనాలు మినహా కాలుష్యానికి కారణం అయ్యే మిగతా ట్రక్కులు ఏవీ ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫోర్ వీల్ వాణిజ్య వాహనాలు కూడా అనుమతించమని స్పష్టం చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌ VI వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అలాగే, రాజధాని పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణ పనులు, కూల్చివేతలు పూర్తిగా నిలివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని నిబంధనలు విధించారు. మిగతా 50 శాతం మంది సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
మరోవైపు, వాయు కాలుష్యం ఆరోగ్యంపై పెను ప్ర‌భావం చూపుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేయ‌గా తాజాగా కాలుష్యం క్యాన్స‌ర్ల‌కూ దారితీస్తుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం ప్ర‌మాక‌రస్ధాయికి చేర‌డంతో  వాయు కాలుష్యానికి దూరంగా ఉండాల‌ని వైద్య నిపుణులు ఢిల్లీ వాసుల‌ను హెచ్చ‌రించారు.

వాయు కాలుష్యం క్యాన్స‌ర్ ముప్పు కార‌క‌మ‌నేందుకు ఆధారాలున్నాయ‌ని ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్ట‌ర్ పీయూష్ రంజ‌న్ చెప్పారు. శ్వాస కోశ వ్య‌వ‌స్ధ‌నూ వాయు కాలుష్యం దెబ్బ‌తీస్తుంద‌ని అన్నారు. మ‌రోవైపు వాయు కాలుష్యానికి గుండె పోటు, అర్ధ‌రైటిస్‌, స్ట్రోక్స్ వంటి హృద్రోగాల‌కు నేరుగా సంబంధం ఉంద‌ని ఇప్ప‌టికే ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయ‌ని డాక్ట‌ర్ రంజ‌న్ పేర్కొన్నారు.ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌తో వాయు కాలుష్యానికి సంబంధం ఉంద‌నేందుకు శాస్త్రీయ ఆధారాలున్నాయ‌ని చెప్పారు.
వాయు కాలుష్యం మ‌నుషుల డీఎన్ఏను ధ్వంసం చేయ‌డంతో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెందుతాయ‌ని చెప్పారు. వాయుకాలుష్యంతో శ‌రీరంలో వాపు ప్ర‌క్రియ పెర‌గ‌డంతో పాటు రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ‌ను క్షీణింప‌చేయ‌డంతో క్యాన్స‌ర్ క‌ణాల‌తో శ‌రీరం పోరాడటం సంక్లిష్టంగా మారుతుంద‌ని అన్నారు.