రెండోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కైవ‌సం

రెండోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కైవ‌సం
సొంతగ‌డ్డ‌పై జ‌రిగిన ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భార‌త మ‌హిళ‌ల హాకీ జట్టు విజేత‌గా నిలిచింది. రాంచీలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో జ‌పాన్‌పై 4-0తో గెలుపొంది.. రెండోసారి చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. మ‌రంగ్ గొమ్కే జైపాల్ సింగ్ అస్ట్రో ట‌ర్ఫ్ హాకీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ భార‌త ప్లేయ‌ర్ల దూకుడు ముందు గ‌ట్టి పోటీనిస్తుందనుకున్న జ‌పాన్ జ‌ట్టు తేలిపోయింది. 
 
సంగీత కుమారి, నేహా గోయ‌ల్, ల‌ర్లెమ్‌సియామి, వంద‌నా క‌టారియాలు త‌లొక గోల్ చేయ‌డంతో టీమిండియా అల‌వోక‌గా గెలుపొందింది. భార‌త జ‌ట్టు 2016లో మొద‌టిసారి చాంపియ‌న్‌గా నిలిచింది. ఆ ఏడాది సింగ‌పూర్‌లో జరిగిన ఫైన‌ల్లో చైనాను 2-1తో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.  స్టేడియంలోని నాలుగు ఫ్ల‌డ్‌లైట్స్ వెల‌గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ నిర్ణీత స‌మయం కంటే 50 నిమిషాలు ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. అయితేనేం ఆట మొద‌లైన కాసేప‌టికే భార‌త్ అటాకింగ్ గేమ్‌తో ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సంగీత కుమారి 17వ నిమిషంలో తొలి గోల్ చేయ‌డంతో ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. 
 
జ‌పాన్ జ‌ట్టు డిఫెన్స్‌లో ప‌డిపోగా నేహా గోయ‌ల్ (46వ నిమిషం) ల‌ర్లెమ్‌సియామి(57వ నిమిషం), వంద‌నా క‌టారియా(60వ నిమిషం) గోల్ కొట్టారు. భార‌త డిఫెండ‌ర్లు కూడా అద్భుతంగా పోరాడ‌డంతో జ‌పాన్ టీమ్ మాత్రం ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయింది. మూడో స్థానం కోసం జ‌రిగిన పోటీలో చైనా 2-1తో ద‌క్షిణ‌ కొరియాను చిత్తు చేసింది.