పేరు మార్చిన ఏపీ పథకంకు రూ. 5,300 కోట్లు ఆపేసిన కేంద్రం

కేంద్రానికి సంబంధించిన పథకం పేరుకు మరో పేరు జతచేసి తమ పథకంగా ప్రచారం చేసుకొంటున్న ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఈ పధకం క్రింద రావలసిన నిధులలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రూ. 5300 కోట్లను  నిలిపివేసింది. దానితో దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం పధకం పేరులో చేసిన మార్పులను తొలగించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం పేరుకు చివరిలో `వైఎస్ఆర్’ అని చేర్చి తమ పథకంగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకంకు ఆ విధంగా పేరు ఏ విధంగా మారుస్తారంటూ కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరింది. 

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఈ ఏడాది ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ మేరకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖకు బదులివకపోవడంతో ఆగస్టు 30న మరోసారి గుర్తు చేశారు. అప్పటికీ సమాధానం రాకపోవడంతో నిధుల విడుదలను ఆపేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు.

పీఎంఏవై పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పేదలకు 2 కోట్ల ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 మార్చిలోగా 1.79 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, పీఎంఏవై పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయిస్తున్నాయి.

పీఎంఏవై -జి పథకం కింద ఒక్కో ఆవాసానికి రూ. 1.3 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తుండగా, ఇందులో ఏపీ ప్రభుత్వం రూ. 70 వేలు భరిస్తోంది. సగంకు పైగా తామే నిధులు భరిస్తున్నప్పుడు తమ పేరును జతచేసి, ప్రచారం చేసుకోవడంలో తప్పేమిటంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం చివరన వైఎస్ఆర్ చేర్చుకుంటామని, కేంద్రం లోగోతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ లోగోను కూడా జత చేసుకుంటామని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి గతంలో లేఖ రాసింది. అయితే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. పీఎంఏవై పథకం కింద ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ లోగోను కూడా వేయడానికి వీల్లేదని ఏపీ సర్కార్‌కు కేంద్రం సూచించింది. ఎలాంటి మార్పులు చేసినా నిధులను నిలిపివేస్తామని తెలిపింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కంటే అధిక నిధులు భరిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని, అయినప్పటికీ, కేంద్రం లోగో, మార్గదర్శకాల మేరకే పథకాన్ని అమలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ‘బంగ్లా ఆవాస్ యోజన’ పేరుతో అమలు చేస్తోంది. దీంతో 2022 నుంచి ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులను నిలిపివేసినట్లు సోమనాథన్ తెలిపారు. ఈ  వివాదం కారణంగా ఈ ఏడాదికి సంబంధించి రూ.4,000 కోట్లతో పాటు, గతేడాది బకాయిలు రూ. 1,300 కోట్లను కేంద్రం ఏపీ ప్రభుత్వానికి నిలిపివేసింది. దానితో, పధకం పేరులో `వైఎస్ఆర్’ పేరుతో పాటు ఏపీ ప్రభుత్వ లోగోను కూడా తొలగించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చివరకు అంగీకరించినట్లు తెలుస్తోంది.