మిజోరాంలో త్రిముఖ పోటీ .. నేడే పోలింగ్

ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో మంగళవారం ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
బంగ్లాదేశ్, మయన్మార్ తో సరిహద్దులు పంచుకునే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 30 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హెచ్‌ లియాంజెలా పేర్కొన్నారు. 
 
బంగ్లాదేశ్‌, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు.
 
ఈ ఎన్నికలలో ప్రధానంగా 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే మిజోరంలో 2023 ఎన్నికలలో ఏ పార్టీ కీలకం కాబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. 1987లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్, అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌)ల మధ్యనే అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నది. 
 
అయితే, ఇప్పుడు ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లల్దుహోమ జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెడ్‌పీఎం) కీలక పోటీదారునిగా నిలిచింది. చిన్న చిన్న పార్టీలు, పౌరసమాజ బృందాలతో కలిపి గత ఎన్నికలలో ప్రవేశించి, 8  సీట్లు గెల్చుకోవడం ద్వారా రాష్ట్ర  రాజకీయాలలో సంచలనంగా మారారు.
 
ముఖ్యమంత్రి జోరంతంగా మరోసారి అధికారంకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ నేతృత్వంలోని ఈశాన్య ప్రాంత ప్రజాస్వామ్య కూటమిలో అధికార ఎంఎన్‌ఎఫ్‌, బీజేపీ భాగస్వామ్య పార్టీలుగా ఉంటున్నప్పటికీ ఉమ్మడి పౌరస్మృతి, మణిపూర్ లో హింసాకాండ కారణంగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దానితో బిజెపి ఒంటరిగా 23 సీట్లలో పోటీ చేస్తున్నది.
 
ఫిబ్రవరి, 2021లో మయన్మార్ లో సైనిక తిరుగుబాటు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరిస్తూ మిజోరాం ప్రభుత్వం 35,000 మంది వలసదారులకు ఆశ్రయం కల్పించడం కూడా బీజేపీ- ఎంఎన్‌ఎఫ్‌ మధ్య విబేధాలకు ఆజ్యం పోశాయి.  అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), ప్రధాన విపక్ష పార్టీ జోరం పీపుల్స్ మూమెంట్ (జేపీఎం), కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లోనూ తమతమ అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 స్థానాల్లోనూ, తొలిసారిగా ఎన్నికల బరిలోకి అడుగుపెట్టిన ఆప్ 4 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి.
 
ఐదు సంవత్సరాలలో తాము చేసిన అభివృద్ధితోపాటు, శరణార్థులు, వలసలు వచ్చిన వారి అంశాన్ని ఉపయోగించుకోవడానికి అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఎంఎన్ఎఫ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం కొనసాగించింది.
 
ముఖ్యంగా పొరుగురాష్ట్రం మణిపూర్ లో చెలరేగిన హింసాకాండను ఆసరాగా చేసుకొని బీజేపీ వ్యతిరేక భావనలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. ఎంఎన్‌ఎఫ్ ఇప్పటికీ ఎన్డీయే భాగస్వామి కాగా,  జెడ్‌పీఎం కాబోయే భాగస్వామి అంటూ ప్రచారం చేస్తున్నారు.
 
కాంగ్రెస్ లో మొదటి నుండి ఆ పార్టీకి అన్న తానే అన్నట్లు వ్యవహరిస్తున్న ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న లాల్ థన్హావ్లా గత ఎన్నికల్లో ఓటమి అనంతరం 2021లో రాజకీయాల నుండి నిష్క్రమించడంతో, ఆయన మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన  లాల్ స్వత నేతృత్వంలో ఏమాత్రం కోలుకొంటుందో చూడాల్సి ఉంది. 
 
 జెడ్‌పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉన్నది. మార్పు రావాలనే నినాదంతోపాటు కొత్త పాలనా వ్యవస్థను తీసుకొస్తామన్న హామీపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకొన్నది.