పశ్చిమాసియాపై ఇరాన్ అధ్యక్షునితో మోదీ ఆందోళన

ఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో  సోమవారం ఫోన్ లో మాట్లాడుతూ పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉగ్రవాద సంఘటనలు, హింస, పౌరుల ప్రాణనష్టంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు  ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశం అనుసరిస్తున్న దీర్ఘకాల, స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించినట్లు చెప్పారు. 

ఆ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరతను దృష్టిలో ఉంచుకుని సంప్రదింపులకు ఇరు దేశాలు అంగీకరించాయని ప్రధాని వెల్లడించారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో సుమారు పది వేల మందికిపైగా పాలస్తీన్లు మరణించడంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 

గాజాలో మానవతా సహాయం, శాంతి, భద్రతల పునరుద్ధరణ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక సహకార పురోగతిని కూడా సమీక్షించినట్లు వివరించారు. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇరాన్‌లోని చబహార్ పోర్టుపై దృష్టిసారించడంతోపాటు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్‌, హమాస్ యుద్ధం ఆరంభమైన అక్టోబర్‌ 7 తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ దృష్టిసారించారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్, జోర్డాన్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యూకే నేతలతోపాటు తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడితో ఆయన మాట్లాడారు.