ఒక సీటుతో సర్దుకున్న సిపిఐ, సిపిఎం సొంతంగా పోటీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్త్ర శాసనసభలో తమకు ప్రాతినిధ్యం  లేకుండా పోవడంతో రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన చెందుతున్న వామపక్షాలు ఈ పర్యాయం ఏదో ఒక పార్టీతో కలిసి శాసన సభలో ప్రవేశించాలని గత ఏడాది కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  మొదట, మనుగోడు ఉపఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం ద్వారా బిజెపి అభ్యర్థిని ఓడించడంలో కీలక పాత్ర వహించిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొంటున్నట్లు ప్రకటించారు. అందుకు బిజెపిని ఓడించేందుకంటూ ఓ సిద్ద్ధాంతం చెప్పారు అనుకొండి.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ సహితం మొదట్లో వామపక్షాలతో కలిసి వేదికలు పంచుకున్నా వారికి సీట్లు ఇవ్వడం అంటే వాటిని కోల్పోవటమే అని గ్రహించి వారికి దూరం జరుగుతూ వచ్చారు. దానితో `ఇండియా’ కూటమి పేరుతో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమయ్యారు. చెరో నాలుగు సీట్ల నుండి కనీసం ఒక సీట్ ఇచ్చినా సరే అంటూ సుమారు రెండు నెలలుగా బేరసారాలు సాగించారు.
 
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా ఈ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. చివరకు సిపిఐ ఒక సీటుతో సరిపెట్టుకొంటున్నట్లు ప్రకటించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సిపిఐకి వదిలేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలిపింది. ఆ తర్వాత మరో ఎమ్యెల్సీ సీట్ ఇవ్వమని కాంగ్రెస్ నేతలను అభ్యర్ధించారు.
మునుగోడులో స్నేహపూర్వక పోటీకి దిగుతామని సిపిఎం చెప్పితే, పోటీ చేయవద్దని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 
సిపిఎంకు కూడా ఖమ్మం జిల్లాలో ఒక సీటు వదలమని కాంగ్రెస్ నేతలను సిపిఐ నేతలు అభ్యర్ధించారు. అయితే, వారు మర్యాదగా ఆ చర్చను మళ్ళించిన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ నుండి ఎటువంటి సంకేతాలు వెలువడక పోవడంతో సిపిఎం 14 సీట్లలో పోటీ చేస్తున్నట్లు అభ్యర్థులను కూడా ప్రకటించింది.
 
‘‘ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం ఇన్ని రోజులు వేచి చూశాం. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఒంటరిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించాం. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు చెరొక స్థానంతో పాటు ఎమ్మెల్సీ ఇస్తాం అన్నారు. సీపీఎం మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నాం. నల్గొండ.. కోదాడ, హుజుర్‌నగర్‌లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటిస్తాం. కొత్తగూడంలో సీపీఐ పోటీ చేస్తోంది. అక్కడ సీపీఐకి మద్దతు ఇస్తాం. సీపీఐ పోటీ చేసే చోట మేము మద్దతు ఇస్తాం’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వీరభద్రం పాలేరు నుండి పోటీ చేస్తున్నారు.