తెలంగాణాలో 9 స్థానాల్లో జనసేన పోటీ 

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డా. కె. లక్ష్మణ్ శనివారం రాత్రి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పొత్తుల కొలిక్కివచ్చాయి. ఈసారి జనసేన 11 చోట్ల పోటీ చేయాలని భావించినా, చివరకు 9 స్థానాలకు అంగీకరించింది. 
 
హైదరాబాద్ లోని కూకట్‌పల్లితో పాటు మరో 8 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి విజయానికి సమష్టిగా పనిచేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.  తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే బీజేపీ 88 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 31 స్థానాల్లో 9 చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన 22 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించనుంది. 

ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌కల్యాణ్‌ కూడా హాజరు కానున్నారు. జనసేన ఎన్డీయే భాగస్వామి కాబట్టే ఆ పార్టీతో పొత్తు ఉందని, అందుకే తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన మద్దతు తెలిపిందని, జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని వివరించారు.

కూకట్ పల్లి, మునుగోడు, నకిరేకల్, కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో దించే అవకాశం ఉంది. నాలుగు స్థానాలపై మరింత స్పష్టం రావాల్సి ఉందని పవన్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్టీయే సమావేశంలో కూడా మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి తాను మాట్లాడమని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డబ్బుతో అభ్యర్థులు, నాయకులను కొనవచ్చు కాని, ప్రజల కోపాన్ని తగ్గించలేరని తెలిపారు. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణవ్యాప్తంగా రాబోతోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామిలా విజృంభించి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెడుతుందని ప్రకటించారు.
ఎంపీ డా.లక్ష్మణ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అవసరం ఉందని చెప్పారు. ఈ దేశానికి మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.