అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తాం

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆస్తులను జప్తు చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కమీషన్ల పేరుతో దోచుకున్న సొమ్మునంతా వసూలు చేస్తామని చెబుతూ మేడిగడ్డ పిల్లర్లు కుంగిన విషయంపై వాస్తవ నివేదిక ఇచ్చిన కేంద్ర బృందంపై అవాకులు చవాకులు పేలుతున్న కేటీఆర్ పై ధ్వజమెత్తారు. 
 
డేట్, టైం ఫిక్స్ చేస్తే ఇరిగేషన్ నిపుణులతో కలిసి మేడిగడ్డకు వస్తానని, కేసీఆర్ ను తీసుకుని మేడిగడ్డకు వస్తే వాస్తవాలు బయటపెడతానని కేటీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ను తీసుకువచ్చే దమ్ముందా? అంటు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కావొద్దని ముస్లిం పెద్దలంతా కలిసి రాహుల్ గాంధీని కలిశారని, అందుకు ఆయన సైతం అంగీకరించినట్లు తనకు సమాచారం ఉందంటూ రేవంత్ ను చూస్తే జాలేస్తుందని సానుభూతి వ్యక్తం చేశారు.
 
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని జాతీయ నాయకత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీల ఆత్మగౌరవ సభకు హాజరవుతున్నారని… ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
 
27 మంది ఓబీసీలను కేంద్రమంత్రులను చేసిన ఘనత బీజేపీదని చెబుతూ బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటిస్తే కూడా మద్దతు తెలపకుండా విమర్శించడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయాలని బీసీలను కోరారు.