జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన రూ.538 కోట్ల ఆస్తులు జప్తు

మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన రూ.538 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టిస్తోంది. కెనరా బ్యాంక్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. 17 నివాస ప్లాట్లు, బిల్డింగ్లు, వాణిజ్య ప్రాంగణాలను ఈడీ జప్తు చేసింది. 

కంపెనీ ఫౌండర్ నరేష్ గోయల్ భార్య అనితా, కుమారుడు నివాన్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. జప్తు చేసిన ఆస్తులు లండన్, దుబాయిలతోపాటు, భారత్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ఉన్నాయి.  “జప్తు చేసిన ఆస్తులలో 17 నివాస ప్లాట్లు, బిల్డింగ్ లు, వివిధ కంపెనీలు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక ఛైర్మన్ నరేష్ గోయల్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు” అని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు బ్యాంకును మోసం చేశారనే ఫిర్యాదుతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మంజూరు చేసిన రుణాలను జెట్ ఎయిర్‌వేస్ స్వాహా చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో బయటపడింది. గోయల్ నిధులను దారి మళ్లించారని ఏజెన్సీ ఆరోపించింది. 

వాటిని నరేష్, ఆయన కుటుంబం వ్యక్తిగత ఖర్చులు, పెట్టుబడులకు ఉపయోగించారని ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సెప్టెంబర్ 1న నరేష్ గోయల్‌ను ఏజెన్సీ అరెస్టు చేసింది. నిన్న ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసింది. గోయల్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 

గతంలో కెనరా బ్యాంక్ జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్‌కి రూ. 848.86 కోట్ల మేరకు క్రెడిట్ పరిమితులు, రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో రూ. 538.62 కోట్ల బకాయిలు ఉన్నాయని బ్యాంకు యాజమాన్యం ఆరోపించింది. గోయల్ విదేశాల్లో వివిధ ట్రస్టులను సృష్టించి, వాటితో స్థిరాస్తులను కొనుగోలు చేశారని ఈడీ పేర్కొంది. ఈడీ ఇంత మొత్తంలో ఆస్తులు సీజ్ చేయడం కలకలం రేపుతోంది.