లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అక్టోబర్ 30న ఈడీ సమన్లు జారీ చేసింది.  గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.  అయితే విచారణకు గైర్హాజరైన ఆయన ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు పయణమయ్యారు.
పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి రోడ్డుషోలో పాల్గొంటారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున గురువారం ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆ సమన్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. 

కేంద్రం విపక్ష నేతలపై చేపడ్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు ఈడీ సమన్లు జారీ చేసిందని ఆరోపించారు.  మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడమే ఈ సమన్ల వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు.  ‘‘సమన్ నోటీసు చట్టవిరుద్ధం. అది రాజకీయ ప్రేరేపితమైనది. బీజేపీ సూచన మేరకు నోటీసు పంపారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేయడానికే నోటీసులు పంపారు. ఈడీ వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలి’’ అని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 

ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. అయితే, గతేడాది ఆగస్టు 17న సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.

ఢిల్లీ మంత్రి ఇంటిపై ఈడీ దాడులు

కాగా, కేజ్రీవాల్‌ విచారణకు ముందు ఆయన కేబినెట్‌లోని మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని 12 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది.  దిగుమతులపై రూ.7 కోట్లకుపైగా కస్టమ్స్‌ ఎగవేత, హవాలా లావాదేవీలకు సంబంధించి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఫిర్యాదు ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. పటేల్‌ నగర్‌ ఎమ్మెల్యే అయిన ఆనంద్ ప్రస్తుతం ఢిల్లీ సాంఘిక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.