లంచం తీసుకొంటూ పట్టుబడ్డ ఇద్దరు ఈడీ అధికారులు

 
లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది.
 
చిట్ ఫండ్ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఈడీ అధికారులైన నావల్ కిషోర్ మీనా, బాబూలాల్ మీనా రూ. 15 లక్షలు అడిగారు. ఈడీ ఇన్‌స్పెక్టర్లు ఒక మధ్యవర్తి వ్యక్తి నుంచి ఆ డబ్బు తీసుకుంటుండగా రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్‌ చేసి అరెస్ట్‌ చేసింది. ఆ ఇద్దరు ఈడీ అధికారుల నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

కాగా, కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను అక్టోబర్‌ 30న ఈడీ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన కుమారుడ్ని ఈడీ ప్రశ్నించడం రాజకీయ ప్రతీకార చర్య అని అశోక్‌ గెహ్లాట్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించాయి.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ డోటాస్ర కుమారులు అభిలాశ్‌, అవినాశ్‌లకు ఈడీ సమన్లు ఇచ్చింది. గోవింద్‌ విద్యా శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ పేపర్ల లీకేజ్‌ కేసులో విచారణకు ఈ నెల 7, 9 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించింది. గత నెల 26న ఈ తండ్రీకొడుకుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. స్వతంత్ర ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి) ఓం ప్రకాశ్‌ హుడియాపై కూడా ఈడీ దృష్టి సారించింది.