అక్టోబర్ లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు

* తెలుగు రాష్ట్రాల్లో రెండంకెల వృద్ధి
భారత్ లో జీఎస్టీ (జీఎస్టీ) వసూళ్లు ప్రతీ నెల కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ అక్టోబర్ నెలలో మొత్తంగా రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం మరో రికార్డు. ఇప్పటివరకు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో వసూలైన జీఎస్టీనే అత్యధికం. కాగా, ఈ అక్టోబర్ లో వసూలైన రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ రెండో అత్యధిక మొత్తం కావడం విశేషం.
 
 గత సంవత్సరం అక్టోబర్ నెలలో వసూలైన జీఎస్టీ తో పోలిస్తే ఈ అక్టోబర్ లో 13% ఎక్కువ జీఎస్టీ వసూలు అయింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లకు చేరగా, అక్టోబర్ 2023లో జీఎస్టీ ద్వారా మొత్తం రూ.1,72,003 కోట్ల ఆదాయం సమకూరింది. 
 
ఇందులో సీజీఎస్టీ రూ.30,062 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,171 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.91,315కోట్లు వసూలయ్యాయి. అలాగే, వస్తువుల దిగుమతిపై ఐజీఎస్టీలో రూ.42,127 కోట్లు వసూలయ్యాయి. మొత్తం వసూళ్లు అత్యధికంగా రూ.1.8 లక్షల కోట్ల మార్కును దాటగా, జీఎస్టీ వసూళ్లలో తొలిస్థానంలో గుజరాత్, రెండో స్థానంలో కర్నాటక నిలిచాయి.
 
 2024 ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి, రూ.9.92లక్షల కోట్లకు చేరుకుంటున్నట్టు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ లో  ఐజీఎస్‌టీ రూపంలో రూ.91,315 కోట్లు రాగా.. రూ. 12,456 కోట్లు సెస్సుల రూపంలో వచ్చినట్లు వెల్లడించింది. ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ తర్వాత అక్టోబర్ నెలకు కేంద్రానికి రూ. 72, 934 కోట్లు, రాష్ట్రాలకు రూ.74, 785 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది.
 
ఇలా ఉండగా, జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది ఇదే సమయంలో తెలంగాణ సీజీఎస్‌టీ వసూళ్లు రూ.9538 కోట్లు రాగ, ఈ ఏడాది రూ.11,377 కోట్లకు పెరిగాయి. మొత్తంగా 19 శాతం మేర వృద్ధి నమోదైంది. సెటిల్‌మెంట్ అనంతరం రూ.23, 478 కోట్లు ఆదాయం వచ్చింది. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సీజీఎస్‌టీ వసూళ్లు రూ.7,347 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.8127 కోట్లకు పెరిగాయి. సెటిల్‌మెంట్ అనంతరం రూ.18,488 కోట్లు ఆదాయం సమకూరింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే సెటిల్‌మెంట్ తర్వాత మహారాష్ట్రకు అత్యధికంగా రూ. 84, 712 కోట్ల ఆదాయం వచ్చింది.