థాయ్‌లాండ్‌ భారతీయులకు ఉచిత వీసా జారీ

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
 
భారత్, తైవాన్‌ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించొచ్చని తెలిపారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనేథాయ్‌లాండ్‌ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రధాని శ్రేత్తా తవిసిన్ తెలిపారు. కాగా, థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌నుంచే ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. 
 
దీన్ని దృష్టిలో పెట్టుకొని థాయ్‌ ప్రభుత్వం ఇటీవలే చైనా పర్యాటకులకు ఫ్రీ వీసా ఎంట్రీకి అనుమతిచ్చింది. ఇప్పుడు తాజాగా భారత్‌, తైవాన్‌కు ఆ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ 29వ తేదీ వరకూ 22 మిలియన్ల మంది థాయ్‌లాండ్‌ సందర్శనకు వెళ్లారు.  దీని ద్వారా 927.5 బిలియన్‌ బాట్‌ (25.67 బిలియన్‌ డాలర్లు) ఆదాయం సమకూరింది. ఇక ఈ ఏడాది 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకుంది.
 
థాయ్‌లాండ్‌లో చూడదగిన ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, పుకెట్, పిఫీ దీవులు ముందువరుసలో ఉంటాయి. ఇక రకరకాల ఆహార పదార్థాలు, నైట్ క్లబ్‌లు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. కాగా, కొద్ది రోజుల క్రితమే శ్రీలంక కూడా భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 
 
భారత్ తోపాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2024, మార్చి 31 నుంచి ఈ సడలింపు అమలులో ఉంటుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో థాయ్ లాండ్ తోపాటు శ్రీలంకను కూడా వీసా లేకుండానే భారత పర్యటకులు సందర్శించవచ్చు.