సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు, 2న విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని సూచించారు.

ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయగా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం. కాగా, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు సోమవారం పేర్కొంది. 
 
లిక్కర్ స్కాంలో రూ. 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దానితో ఆప్ నేతలు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడంతో కేజ్రీవాల్ కు అధికారంలో కొనసాగే నైతిక అధికారం లేదని ఢిల్లీ బిజెపి స్పష్టం చేసింది.
 
కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర శచీదేవ డిమాండ్ చేశారు. మనీష్ సిసోడియా, ఆప్ నేతలు అవినీతికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు వాఖ్యలు స్పష్టం చేయడంతో కేజ్రీవాల్ తో పాటు ఇతర ఆప్ అగ్రనేతలను అరెస్ట్ చేయడం ఇక తప్పదని బిజెపి ఎంపీ మనీష్ తివారి స్పష్టం చేశారు.
 
మనీష్ సిసోడియాకు ముందు ట్రయిల్ కోర్ట్, తర్వాత హైకోర్టు, ఇపుడు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో తాము అవినీతికి పాల్పడలేదని ఆప్ నాయకులు చేస్తున్న వాదనలలో పసలేదని స్పష్టమైందని బిజెపి అధికార ప్రతినిధి షెహజాజ్ పొన్నవాలా తెలిపారు. ఈ కుంభకోణంలో నగదు ఎక్కడ చేతులు మారిందని ఆప్ నేతలు వాదిస్తూ వస్తున్నారని, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రూ 338 కోట్లు చేతులు మారినట్లు తేల్చి చూపిందని ఆయన పేర్కొన్నారు.
 
ఆ విచార‌ణ‌కు హాజ‌రైన స‌మ‌యంలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేస్తుంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీను అరెస్టు చేసే స‌మాచారం త‌మ‌కు ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.