పార్టీల విరాళాలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు

రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌ వెంకటరమణి ఆదివారం సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఏజీ న్యాయస్థానానికి స్టేట్‌మెంట్‌ సమర్పించారు. 

ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకొనేందుకు పోటీచేస్తున్న అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకొనేందుకు ప్రజలకు హక్కు ఉందని, అంతేగానీ ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొనే ప్రాథమిక హక్కు లేదని పేర్కొన్నారు.స్పష్టమైన రాజ్యాంగపరమైన చట్టం లేనందున, ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. 

“ఈ పథకంతో విరాళాలు ఇచ్చేవారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. స్వచ్ఛమైన మార్గాల్లో డబ్బును సమకూర్చుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పన్ను బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేర్చేలా చేస్తుంది. అందువల్ల ఎలాంటి నిబంధనలు, హక్కులను ఈ పథకం ఉల్లంఘించలేదు. ” అని అటార్నీ జనరల్ తెలిపారు.

రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ పారదర్శకమైనదని తెలిపారు. ఈ పథకం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు స్వచ్ఛమైన ధనం విరాళంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చామని తెలిపారు. అయితే ఆ విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని పేర్కొన్నారు.

విరాళ దాతల వివరాలను గోప్యంగా ఉంచడానికి ఈ పథకం దోహదపడుతుందని కేంద్రం పేర్కొన్నది. పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని నోటిఫై చేసింది. 

దేశానికి చెందిన ఓ వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు లేదా సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలను నగదు రూపంలో ఇవ్వడానికి బదులుగా ఈ బాండ్ల రూపంలో ఇవ్వవచ్చు. ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు 2020 జనవరి 20న తిరస్కరించింది. 2019 ఏప్రిల్‌లో కూడా ఈ పథకాన్ని నిలిపేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.