
లోక్సభ సభ్యత్వ లాగిన్ దుర్వినియోగం ఆరోపణలపై టిఎంసి ఎంపి మహూవా మొయిత్రాని ఎథిక్స్ కమిటీ గురువారం విచారిస్తుంది. ప్రత్యేకించి ఈ ఎంపి పార్లమెంటరీ ఖాతా లాగిన్ ద్వారా దుబాయ్లోని పలు ప్రదేశాల నుంచి ఏకంగా 47 సార్లు ఇతరులు చొరబడినట్లు వెలువడ్డ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త, దుబాయ్లో పలు కంపెనీలు ఉన్న దర్శన్ హీరానందని ఈ ఎంపి ఖాతాను దుర్వినియోగపర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ ఇప్పుడు సబంధిత విషయంపై ఎంపిని ప్రశ్నించే వీలుంది. అంతేకాకుండా సంబంధిత అంశంపై మూడు మంత్రిత్వశాఖల నుంచి తమకు అందిన నివేదిక ప్రాతిపదికన టిఎంసి ఎంపిని ప్రశ్నించనున్నారు.
ఇప్పటికే హీరానందని కమిటీకి సంచలనాత్మక అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తనకు ఎంపిలాగిన్ అందిందని తెలిపారు. పలు ఇతర విషయాలను కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పటికీ ఆయన నుంచి కానీ ఆయన కంపెనీ వర్గాల నుంచి కానీ ఇదంతా కూడా క్యాష్ ఫర్ క్వారీ సాగిందా? లేదా అనే విషయంపై వివరణ రాలేదు .
కాగా అక్టోబర్ 31న ఎథిక్స్ కమిటీ ముందు ఈ ఎంపి విచారణకు హాజరు కావల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాలతో తాను ఈ తేదీన రాలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. దీనితో ఆమెకు చివరి అవకాశంగా ఈ నెల 2న హాజరయ్యేందుకు వీలు కల్పించారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సమాచార సాంకేతిక శాఖ, విదేశాంగ శాఖలు ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
గత నెల 26వ తేదీన కమిటీ ఈ ఎంపి సంబంధిత విషయంపై సమావేశం అయింది. విచారణకు ఒక్కరోజు ముందు ఆమె లాగిన్కు సంబంధించి బిజెపి ఎంపి నిశికాంత్ దూబే చేసిన ఆరోపణలలోని కొన్ని ఇతర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆమె పార్లమెంటరీ అకౌంట్కు చెందిన దాదాపు 47 లాగ్ ఇన్స్ దుబాయ్ నుంచి చేసినట్లుగా ఉన్నాయని వెల్లడైంది.
కాగా తనపై వచ్చిన నేరపూరిత ఆరోపణలను విచారించే అధికారం పార్లమెంటరీ నైతిక వ్యవహారాల కమిటీకి లేదని టిఎంసి ఎంపీ ఓ లేఖ పంపించారు. తనకు సమన్లు వెలువరించినట్లు మీడియాకు సమాచారం ఇవ్వడం, అంతకు ముందు తనకు వ్యతిరేకంగా ప్రచారానికి వీలు కల్పిండచం వంటి నేపథ్యంలో విచారణకు ముందు రోజు ఈ లేఖను తాను వెలువరిస్తున్నట్లు ఈ ఎంపి తెలిపారు.
అయితే, లోక్సభ సభ్యురాలిగా ఉంటూ మొయిత్రా ఇతరులకు తమ పార్లమెంటరీ లాగిన్ వివరాలు ఇవ్వడం, కీలక ప్రశ్నలకు ఇతరులకు అవకాశం కల్పించడం తీవ్రస్థాయి విషయం అని బిజెపి ఎంపి దూబే విమర్శించారు. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీసే అంశం అవుతుందని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ, ముందు ఎంపిపై తక్షణ చర్య అవసరం అని డిమాండ్ చేశారు.
More Stories
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా