మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమే

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా కోటాపై బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తరువాత షిండే ఈమేరకు ప్రకటించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం మరాఠా కోటాకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోజ్ బరాంగే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. 

మరాఠాలకు రిజర్వేషన్లు వర్తింప చేసేందుకు ప్రభుత్వంతో సహకరించాలని జరాంగేకు అఖిలపక్షం విజ్ఞప్తి చేసిందని సీఎం షిండే తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వానికి సమయం అవసరమని , ఈ విషయంలో మరాఠాలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇతర కులాలకు చెందిన రిజర్వేషన్ కోటా దెబ్బతినకుండా మరాఠా ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని బుధవారం మహారాష్ట్రలో జరిగిన అఖిల పక్ష సమావేశం మరోసారి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మరాఠా రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష సాగిస్తున్న జాల్నాకు చెందిన హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్‌ను తన దీక్షను ఉపసంహరించుకోవలసిందిగా కూడా అఖిలపక్ష సమావేశం విజ్ఞప్తి చేసింది. 

హింసాకాండ, దహనకాండ కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. మరాఠా ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని సమావేశం తీర్మానించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విలేకరులకు తెలిపారు. ఇతర కులాలలకు చెందిన రిజర్వేషన్లు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

అయితే, దీనికి కొంత సమయం పడుతుందని, అంతవరకు అందరూ సహనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ముంబైలోని మలబార్ హిల్‌లోగల సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి షిండే అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇలా ఉండగా, మహారాష్ట్ర మంత్రి హసన్ ముష్రిఫ్ వాహనంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇనుపరాడ్లతో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో మంత్రి ఆ వాహనంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనతో ప్రభుత్వం ఆయన భద్రతను పెంచింది. మరాఠా రిజర్వేషన్ ఆందోళన కారులు ఇటీవల ఎన్సీపీ ఎమ్‌ఎల్‌ఎ ప్రకాశ్ సోలంకే నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.