వాంఖడే స్టేడియంలో సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బుధవారం ఆవిష్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై, బీసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, ఎన్‌సీపీ పార్టీ అధినేత, మాజీ ఐసీసీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఎంసీఏ అధ్యక్షుడు అమోల్‌ కాలేతో పాటు సచిన్‌ కుటుంబీకులు హాజరయ్యారు. 
 
సచిన్‌ 50వ పడిలోకి ప్రవేశించిన సందర్భంగా వాంఖడే స్టేడియంలో సచిన్‌ టెండూల్కర్‌ స్టాండ్‌ సమీపంలో ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావించినా నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 
 
కార్యక్రమానికి హాజరయ్యే ముందు స్టేడియంలో ఓ దివ్యాంగు అభిమానుడికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. సచిన్‌ విగ్రహాన్ని అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్‌ కాంబ్లే తయారు చేశారు. సచిన్‌ ఐకానిక్‌ స్ట్రోక్‌ను విగ్రహంగా మలిచారు. ఇక సచిన్‌ తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ను 2013 నవంబర్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 118 బంతుల్లో 74 పరుగులు సాధించాడు.తన విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా సచిన్‌ వాంఖడే స్టేడియంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 1983లో వెస్టిండిస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో స్టేడియంలోకి తొలిసారిగా బాంద్రాలోని స్నేహితులతో కలిసి స్టేడియానికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.

తాను నార్త్‌ స్టాండ్‌కు వెళ్లానని చెప్పాడు. వాంఖడే స్టేడియంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ చేసేందుకు సునీల్‌ గవాస్కర్‌ ఆహ్వానించారని, 14 ఏళ్ల పిల్లవాడికి అది చాలా పెద్దవిషయమని చెప్పుకొచ్చాడు. తాను 15 ఏళ్లకు క్రికెట్‌ ఆడేందుకు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చానని గుర్తుచేసుకున్నాడు. 

 అప్పటికే పెద్దపెద్ద ఆటగాళ్లు అక్కడ ఉన్నారని, ఎక్కడ కూర్చోవాలో తెలియదని, ఒక ఖాళీ సీటుగా కనిపించిందని, కిట్‌ను తీసుకెళ్లి కూర్చున్నానని, ఆ సీటు ఎస్‌ఎంజీ (సునీల్‌ మనోహర్‌ గవాస్కర్‌)ది అని చెప్పారని సచిన్‌ వివరించారు. కెప్టెన్సీపై స్పందిస్తూ 2007లో కెప్టెన్సీ ఆఫర్‌ వచ్చిందని, శరద్‌ పవార్‌ను కలిసి స్లిప్స్‌లో నిలబడి మాట్లాడే మహేంద్ర సింగ్‌ ధోని పేరును సూచించినట్లు వివరించారు.