అదనపు డీజీ,ఏఏజీ మీడియా సమావేశాలపై హైకోర్టు విచారణ

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సిఐడి అదనపు డీజీ సంజయ్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్లడిపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 

వారిద్దరూ మీడియాతో మాట్లాడిన వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి తమ ముందుంచాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో పర్యటన, మీడియా సమావేశాల నిర్వహణకు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? అని ఆయనను ప్రశ్నించింది. సంబంధిత వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.  టీడీపీ అధినేత చంద్రబాబుపై దాఖలు చేసిన స్కిల్‌ కేసు వివరాలను మీడియా సమావేశాలు నిర్వహించి వెల్లడించడం ద్వారా సీఐడీ చీఫ్‌, ఏఏజీ నిబంధనలు అతిక్రమించారని, వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ యునైటెడ్‌ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 

రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, ఢిల్లీలో కూడా వారు పర్యటించి మీడియా సమావేశాల నిర్వహణకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. సివిల్‌ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించిన వీరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మాజీ సీఎం చంద్రబాబుపై కేసు పెట్టిన సీఐడీ ఇతర రాష్ట్రాల్లో పర్యటించి కేసు వివరాలు వెల్లడించేందుకు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిందని ప్రశ్నించారు. సీఎం జగన్‌ కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఏఏజీ మీడియా ముఖంగా ప్రకటించారని, చంద్రబాబుపై వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజాధనాన్ని వినియోగించారని తెలిపారు.

కోర్టుకు వెల్లడించాల్సిన దర్యాప్తు వివరాలను పత్రికా సమావేశాలు పెట్టి వెల్లడించడం ద్వారా వారు నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై చర్యలు తీసుకునేలా సీఎస్‌, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ  ఏఏజీ మీడియా సమావేశాలు నిర్వహించకుండా నిషేధిస్తూ న్యాయవాదుల చట్టం, ఇతర నిబంధనలు ఏమైనా ఉంటే చెప్పాలని కోరింది.

 మీడియా సమావేశంలో సీఐడీ చీఫ్‌, ఏఏజీ మాట్లాడిన వివరాలను ఆంగ్లంలోకి తర్జూమా చేసి తమ ఉందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. దానిని పరిశీలించి వారు చేసిన వ్యాఖ్యలు అనైతకమా? కాదా? అలా మాట్లాడేందుకు చట్టం అనుమతిస్తుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.  అంతేకాదు ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్టీఐ క్యాంపెయిన్‌ సంస్థ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.