తాజాగా కాళేశ్వరంలోని అన్నారం బ్యారేజీ లీక్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారు. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం ఆందోళన కలిగించింది. ఈ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది.
 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజీ గేట్లు మూసేసినా కింద నుంచి ఊట ఉబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 5.71 టీఎంసీల నీటిమట్టం ఉంది. దీంతో ఒక గేటును ఎత్తి 2,357 టీఎంసీల నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 4వ బ్లాక్ లోని 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్లీకవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వీడియోను ట్వీట్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.  ఈ ఘటనపై వాస్తవాలను నిర్థారించగలరా? అంటూ సీఎం కేసీఆర్‌ ను ఆయన ప్రశ్నించారు. ‘కాళేశ్వరం అన్నారం బ్యారేజ్ 4వ బ్లాక్, పిల్లర్ నెం. 41 దిగువ నుంచి నీరు, ఇసుక కొట్టుకుపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు రెండు రోజులుగా ఇసుక బస్తాలు వేస్తున్నారు. ప్రవాహ వేగంతో పిల్లర్ బేస్ నుంచి ఇసుక కొట్టుకుపోకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు’- అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీని నిర్మించారు. 66 గేట్లతో 1.2 కి.మీ పొడవుతో అన్నారం సరస్వతి బ్యారేజీని నిర్మించారు. అయితే బ్లాక్ 4 వద్ద బ్యారేజ్ బేస్మెంట్ కింది నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. రాళ్లు, సిమెంట్ బస్తాలతో గండిని పూడ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 8.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని సమాచారం. నీళ్లను బయటకు వదిలితేనే సమస్య మొదలైన ప్రదేశం గుర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎలాంటి ప్రమాదం లేదు, పుకార్లు నమ్మొద్దు

ఇలా ఉండగా, అన్నారం బ్యారేజీపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏ. యాదగిరి తెలిపారు. బ్యారేజీకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజ్ కు ఢోకా లేదన్న ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 
 
1275 మీటర్ల పొడవులో రెండు చోట్ల సీపేజ్ ఉందని, ఎక్కడా కూడా ఇసుక రావడం లేదని చెప్పారు. ఇరిగేషన్ శాఖ, ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉందని, బ్యారేజీ నిర్వహణ బాధ్యత వాళ్లదే అని తెలిపారు. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్ వేస్తున్నామని చెప్పారు. సాండ్ తో రింగ్ బండ్ కూడా వేస్తున్నామని పేర్కొన్నారు. 
 
ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపేజ్ వాటర్ తట్టుకునే విధంగా నిర్మాణంలో మార్పులు ఉంటాయని, అవసరం అయితే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తామని వివరించారు. అయితే, అన్నారం బ్యారేజీ గేట్ల కింద ఇసుక మేట వేయటం, నీరు బయటకు వచ్చే చోట కొన్ని బ్లాక్స్ జరగడం వంటి సమస్యలు ఉన్నాయని, వీటితో బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు.
 

కాగా, అక్టోబర్ 22న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ రెండు అడుగల మేర కుంగిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 7వ బ్లాక్లోని 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుంగింది. దీంతో దీనికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా భారం పడింది. నీటి ప్రవాహానికి ఇసుక కొట్టుకుపోవడం కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఇవి సాధారణ సమస్యలను ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇందులో నిర్మాణలోపాలు లేవని వివరణ ఇచ్చారు.