సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యం

తెలంగాణలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, బిసి ముఖ్యమంత్రి ప్రకటనతో బిసి సంఘాల నుంచి విశేష స్పందన వస్తుందని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. దమ్ము, దైర్యమున్న తమ పార్టీ తప్పకుండా చెప్పిన హామీని అమలు చేస్తుందని స్పష్టం చేయసారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కిషన్‌రెడ్డి సమక్షంలో ఆపార్టీలో చేరారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే బిసి, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. తొలి నుంచే తమ పార్టీ సామాజిక న్యాయం చేసే పార్టీ అని అబ్దుల్ కలాం, ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత ఒక్క బిజెపికే సొంతమని చెప్పారు. 

కాంగ్రెస్, ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మంత్రులు పాతబస్తీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు సైతం కట్టరని తెలిపారు. ఆ పార్టీ రౌడీయిజం, గూండాయిజం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 

పాతబస్తీలో మజ్లిస్ చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని పేర్కొంటూ అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో  కేసీఆర్ ప్రభుత్వం ఉండటం హేయనీయమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో అవినీతికి మోసానికి గ్యారెంటీ ఇచ్చిందని దుయ్యబట్టారు.  అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటకలో ఐదు గ్యారెంటీ పేరిట ఇచ్చిన హామీలు అమలులో మాత్రం శూన్యమని విమర్శించారు.

ఇదే తరహాలో తెలంగాణ ప్రజలు నమ్మించడానికి కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి వచ్చారని ఓటు వేస్తే మళ్లీ జనాలు మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి బిజెపికి అధికారం ఇస్తే దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దుతామని, ఈఎన్నికల్లో ప్రజా ఆశ్వీరాదం తోడైతే కేంద్ర ప్రభుత్వంతో కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాన్ని అభివృద్దిలో నెంబర్ స్దానంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు.