బీఆర్‌ఎస్ ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై దాడి .. గవర్నర్ దిగ్బ్రాంతి

మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్న సమయంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. 

దాడి జరగగానే అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన దట్టని రాజుగా గుర్తించారు.  అతడు ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. 

మరోవైపు, దాడి అనంతరం తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌భాక‌ర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు స్పందిస్తూ  ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. లోతైన గాయాలు కాకపోవటంతో ప్రమాదం తప్పిందని పేర్కొంటూ గాయం అయిన చోట్లు ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు చెప్పారు.

ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్‌ డా. తమిళిసై  సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ రెడ్డి త్వరగా కొలుకోవాలని కోరుతూ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. 
 
”ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే సమయంలో వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం చాలా అవసరం” అని గవర్నర్‌ పేర్కొన్నారు.
కాగా, చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు.