స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలులో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఎసిబి కోర్టు జడ్జికి వ్రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తన భద్రత, ఆరోగ్య సమస్యలపై అనుమానం వ్యక్తం చేస్తూ చంద్రబాబు బుధవారం రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారులు శుక్రవారం ఎసిబి కోర్టు జడ్జికి పంపారు.
తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పికి కూడా లేఖ వచ్చిందని, దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని వివరించారు. తనను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసిందని పేర్కొన్నారు. జైలుకు వచ్చినప్పుడు తనను అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారని, ఆ ఫుటేజీని పోలీసులే లీక్ చేశారని లేఖలో వివరించారు.
తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజీని రిలీజ్ చేశారని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని చెప్పారు. జైలులో పెన్ కెమెరాతో డ్రగ్స్ కేసు నిందితుడు తిరుగుతున్నాడని, ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడని తెలిపారు. ఈ నెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేసి తన కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేశారని విస్మయం వ్యక్తం చేశారు.
ములాఖత్‌లో తనను కలిసిన వారి చిత్రాల కోసం కూడా డ్రోన్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైసిపి వారేనని అనుమానమని ఆ లేఖలో పేర్కొన్నారు.
డ్రోన్ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించలేదని, జైలు అధికారుల నిస్సహాయతకు ఇది నిదర్శనమని విమర్శించారు. కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరితే గార్డెనింగ్ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారని ఆరోపించారు. రాజమండ్రి జైలులో మొత్తం 2,200 మంది ఖైదీలు వుంటే, అందులో 750 మంది డ్రగ్స్ కేసు నిందితులని వివరించారు.
కొంతమంది ఖైదీల వల్ల తన భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న తన భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు అని లేఖలో పేర్కొన్నారు. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ తెలిపారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా గుర్తించామని చెప్పారు.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం