త్వరలో నేర చట్టాల బిల్లుకు ఆమోదం

బ్రిటిషర్ల కాలం నాటి చట్టాలకు కాలం చెల్లిందని, వాటి స్థానంలో కొత్త చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం కొత్త నేర చట్టాల బిల్లును తీసుకొచ్చిందని చెబుతూ త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

శుక్రవారం హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 75వ బ్యాచ్ ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో అమిత్ షా పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న 175 మంది ట్రైనీ ఐపీఎస్ ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ట్రైనీ ఐపీఎస్ లను ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడారు.

దేశ ప్రతిష్టలు కాపాడంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమైందని చెబుతూ దేశ అత్యున్నత కోసం ఐపీఎస్‌లు పాటుపడాలన్నారు. దేశానికి సేవ అందించడంలో ఐపీఎస్‌లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. పీడిత ప్రజల అభ్యున్నతి వారి భద్రత కోసం ఐపీఎస్‌లు నిబద్దతతో కృషి చేయాలని సూచించారు. 

75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండడం సంతోషం, గర్వకారణమని కొనియాడారు. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీపై ఐపీఎస్‌లు దృష్టి కేంద్రీకరించాలని కేంద్రమంత్రి తెలిపారు. నక్సలిజం, టెర్రరిజం వాటిపై ఐపీఎస్‌లు శిక్షణ తీసుకుని శుసిక్తులు అయ్యారని పేర్కొంటూ భవిష్యత్‌లో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఐపీఎస్‌లు అలవోకగా ఎదురుకోవాలని చెప్పారు.

సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాలు బ్రిటిష్ పాలన కాలం నాటివని, ప్రస్తుత పరిస్థితులకు ఇవి సరిపోవని అమిత్ షా స్పష్టం చేశారు. శాసనాలకు రక్షణ కల్పించడమే వీటి ఉద్దేశమని, అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల హక్కులను కాపాడడమే లక్ష్యంగా కొత్త చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 ప్రస్తుతం వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సమాజానికి సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు.  ఆర్గనైజింగ్ క్రైమ్, సైబర్ క్రైమ్ క్రిప్తో కరెన్సీ, హవాలా చలామణి, నకిలీ నోట్ల చలామణి, గ్రేహౌండ్, నార్కోటిక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్, చార్జిషీట్ ఫైల్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి అన్ని అంశాలపై ఐపీఎస్‌లు పట్టు సాధించాలని అన్నారు.

అంతిమంగా ఐపీఎస్‌లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలని చెప్పారు. అమరవీరుల బలిదానాన్ని ప్రేరణగా తీసుకుని కర్తవ్య నిర్వహణలో పట్టుదలగా ఉండాలని అమిత్ షా సూచించారు.