లోకేష్ పదే పదే కోరి మరి అమిత్ షాను కలిశారు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన అనంతరం ఆయన కుమారుడు నారా లోకేష్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవడం వెనుక తానే ఉన్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కొట్టిపారేసారు.   
 
అమిత్‌షా భేటీ తర్వాత తాను అపాయింట్‌మెంట్‌ కోరలేదని, తనకు కిషన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, అమిత్ షా తనను కలుస్తానని చెప్పినట్లు ఫోన్ చేసి చెప్పడంతో తాను వెళ్లానని నారా లోకేశ్ చెప్పడంతో రాజకీయ దుమారంరేగింది. పైగా, ఆ భేటీలో  రెండు తెలుగు రాస్త్రాల బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, డి పురందేశ్వరి కూడా అక్కడే ఉండడంతో టిడిపి- బిజెపి పొత్తుకోసం ఈ భేటీ జరిగిందనే కధనాలు అప్పట్లో వెలువడ్డాయి.  
 
దానితో లోకేష్ వాఖ్యలు కిషన్ రెడ్డిని ఇరకాటంలోకి పడవేయడంతో ఆయన స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.  అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం పదేపదే అడిగిన తర్వాతే అది ఖరారైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమిత్‌షాను నారా లోకేష్ కలవడంలో తన పాత్ర లేదని స్పష్టత ఇచ్చారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక మంత్రి తానే కావడంతో భేటీ సమయంలో ఉండాల్సి వచ్చిమదని చెప్పారు. 
 
 చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేష్ పలుమార్లు అమిత్‌షా, మోదీల అపాయింట్‌ మెంట్‌ కోరారని, ఆ సమయంలో బీజేపీ పెద్దలు బిజీగా ఉన్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళాబిల్లు, జి20 సమావేశాల నేపథ్యంలో అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేకపోయారని, వీలు కుదిరినపుడు తానే పిలిపించుకుంటానని చెప్పారని తెలిపారు. 
 
చివరకు తన ద్వారా లోకేష్‌కు సమాచారం అందించారని కిషన్ రెడ్డి చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎవరినైనా కలుస్తారని, కాంగ్రెస్‌ వారిని కూడా తాము కలుస్తామని తెలిపారు. అమిత్‌ షా.. టీడీపీ నాయకుడు లోకేష్‌ను కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, హోంమంత్రిగానే అమిత్‌షా లోకేష్‌ను కలిశారని చెప్పారు.