గుండెపోటుతో కిందపడిపోయిన పుతిన్?

ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి ఎన్నో వదంతులు, వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన గుండెపోటుకు గురయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది. గుండె పోటు రావడంతో పుతిన్ మంచం మీది నుంచి కింద పడిపోయారని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. 
పుతిన్‌ గుండెపోటుకు గురైనట్లు పలు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి 9.05 గంటలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ “కార్డియాక్ అరెస్ట్”తో బాధపడ్డారని ఆయన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక పోస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి ఆయన బెడ్‌రూంలో మంచం మీది నుంచి కింద పడ్డారనేది ఆ టెలిగ్రామ్ పోస్ట్ సారాంశం.
బెడ్‌రూంలోని నేలపై ఆహార పదార్థాల వద్ద కిందపడి కనిపించారని పేర్కొంది. ఆయన పక్కనే ఆహారం, డ్రింక్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది గుర్తించినట్లు అంతర్జాతీయ కథనాల ద్వారా బయటికి వచ్చింది.  పుతిన్ బెడ్‌రూమ్ తలుపులు పగులగొట్టి భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లి వెంటనే పుతిన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని నివేదికలు తెలిపాయి. 
దీంతో వెంటనే అతనికి వెంటనే అత్యవసర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. పుతిన్‌కు రహస్యంగా మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా పలు మార్లు పుతిన్ అస్వస్థతకు గురైనట్లు వివిధ కథనాలు వెలువడ్డాయి. ఆయనకు పార్కిన్సన్ వ్యాధి సోకిందని దాన్ని నయం చేసుకునేందుకు ప్రత్యేక చికిత్స కూడా తీసుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయి.

కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను రష్యా ప్రభుత్వం మంగళవారం ఖండించింది. పుతిన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తనను పోలిన మనిషిని పుతిన్ ఉపయోగిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను కూడా ప్రభుత్వ ప్రతినిధి డెమిట్రీ రెస్కోవ్ ఖండించారు. ఇవన్నీ కట్టుకథలని ఆయన తోసిపుచ్చారు.