జీహాద్ నినాదాల‌పై రిషీ సునాక్ ఆగ్రహం

బ్రిట‌న్ వీధుల్లో జీహాద్ నినాదాల‌పై యూకే ప్ర‌ధాని రిషీ సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లండ‌న్ ర్యాలీలో జీహాద్ నినాదాల‌పై ఘాటుగా బ‌దులిచ్చారు. దేశంలో ఇలాంటి నినాదాల‌ను తాము ఉపేక్షించబోమ‌ని హెచ్చ‌రించారు. 
 
ఇజ్రాయెల్‌- పాల‌స్తీనా మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ మ‌ధ్య భీక‌ర పోరు సాగుతున్న క్ర‌మంలో బ్రిట‌న్ ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు.  జీహాద్‌కు పిలుపు ఇవ్వ‌డం కేవ‌లం యూధుల‌కు ముప్పు మాత్ర‌మే కాద‌ని, త‌మ ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కూ విఘాత‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
సెంట్ర‌ల్ లండ‌న్‌లో శ‌నివారం దాదాపు లక్ష‌ మంది పాల‌స్తీనాకు సంఘీభావం ప్ర‌క‌టిస్తూ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. వీరంతా ఈ సంద‌ర్భంగా జీహాద్ నినాదాల‌తో హోరెత్తించ‌డం క‌ల‌క‌లం రేపింది. “ఈ వారాంతం మ‌న వీధుల్లో విద్వేషం విరజిమ్మ‌డం చూశాం..జీహాద్‌కు పిలుపివ్వ‌డం యూధుల‌కే కాకుండా మ‌న ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కూ ముప్పే” అంటూ  రిషీ సునాక్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రాసుకొచ్చారు. 
 
విద్వేష ఉగ్ర‌వాదాన్ని వెద‌జ‌ల్లే వారు చ‌ట్టం ఆగ్ర‌హానికి గురికాకత‌ప్ప‌ద‌ని నిర‌స‌న‌కారుల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. పాల‌స్తీనాకు అనుకూలంగా చేప‌ట్టిన నిర‌స‌న‌లో జీహాద్ నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని మెట్ర‌పాలిట‌న్ పోలీస్ చీఫ్ స‌ర్ మార్క్ రౌలీ త‌ప్పుప‌ట్టారు.