భారత్‌కు ఒకేసారి రెండు తుపాన్లు నుంచి ముప్పు

భారత్‌కు ఒకేసారి రెండు తుపాన్లు నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతంలో హమూన్ తుపాను రెండూ భారత్ భూభాగం పైకి దూసుకు వస్తున్నాయని స్పష్టం చేశారు.  తేజ్ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారి యెమెన్‌ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈ తుపాన్ వాయువ్య దిశగా కదిలి, అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమెన్) మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 140 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. తీర రేఖకు ఇరువైపులా ఒకేసారి రెండు తుపానులు సంభవించడం చాలా అరుదని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. చివరిసారిగా 2018 లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

హమూన్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదులుతోంది. తొలుత నైరుతి దానిని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం సంభవించినట్టు ఐఎండీ నివేదించింది. అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీనికే హమూన్ అని పేరు పెట్టారు. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు.

ఈ రెండు తుపాన్లు వాతావరణంపై పెనుప్రభావం చూపవని, తమిళనాడు, చెన్నై తీరాలలో తుపాను తీరం దాటిన వెంటనే వాతావరణం మారుతుందని వివరించారు.  ఈ తుపాను ప్రభావంతో కేరళ, తమిళనాడు లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ తుపాన్ల ప్రభావంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పారు. మత్సకారులు చేపలవేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవంక, ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. శనివారం రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయని, వీటి ప్రభావంతో దక్షిణాదిన తమళనాడు ,కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) తెలిపింది. 
 
రుతుపవనాల తిరోగమనం వల్ల ఆగ్నేయ ,మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని ఐఎండి వెల్లడించింది. అదే విధంగా కొమెరిన్ ఏరియాపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. శక్తివంతమైన ఈశాన్య గాలులు దక్షిణ ,మధ్య బంగాళాఖాతంపై బలంగా వీస్తున్నాయని వెల్లడించింది.