ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం

 
ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడ్డట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆపరేషన్‌ను నిలిపివేశారు. రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. నియంత్రణ రేఖ మీదుగా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందింది. 

దీంతో దళాలు యాంటీ ఇన్‌ఫిల్ట్రేషన్ గ్రిడ్‌ను పటిష్టం చేశారు. ఎడతెరిపి లేని వర్షం, తక్కువ దృశ్యమానత ఉండడంతో సాయుధ ఉగ్రవాదులు నియంత్రణ రేఖగుండా చొరబాటుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. 

ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని.. మిగతా ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుపోయారని అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. రాత్రంతా ఆ ప్రాంతంలో నిఘా వేసి ఉంచామని పేర్కొన్నారు. మరికొందరు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని, సంఘటనా స్థలంలో ఆయుధాలన్నీ రక్తంతో తడిసిపోయాయని పేర్కొన్నారు.