ఎస్‌యూవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌

ఒకప్పుడు 50 నుండి 60 శాతం వరకు తక్కువ ధరలలో లభించే చిన్న కార్లు అమ్మకాలు అత్యధికంగా జరుగుతూ ఉండగా, ఇప్పుడు పెద్ద కార్లకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఎస్‌యూవీల డిమాండ్‌ ఎక్కువగా ఉంటూ ఉండడంతో అన్ని కార్ల తయారీ కంపెనీలు ఎస్‌యూవీలపై కేంద్రీకరిస్తున్నాయి. 

స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లు హోదాకు గుర్తుగా మారుతున్నాయి. లగ్జరీ, కంఫర్ట్‌, ఆధునిక ఫీ చర్లు వీటి అమ్మకాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం ఆఫీస్‌లకు వెళ్లే వారు కూడా ఎస్‌యూవీల పట్ల మొగ్గు చూపుతున్నారు.  హాచ్‌బ్యాక్‌, సిడాన్‌ కార్లకు డిమాండ్‌ రోజు రోజుకూ తగ్గిపోతున్నది. దీంతో దేశంలో చిన్న కార్లు చిన్నబోతున్నాయి.  ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో సగానికిపైగా ఎస్‌యూవీలు ఉంటున్నాయి. ఐదు సంవత్సరాల్లో ఎస్‌యూవీల మార్కెట్‌ వాటా రెట్టింపు అయ్యింది. 

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విక్రయించిన 3,63,733 కార్లలో ఎస్‌యూవీల వాటా 52 శాతంగా ఉంది. 2022 సెప్టెంబర్‌లో మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 43.6 శాతంగా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 48.3 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వీటి అమ్మకాల వాటా 41.5 శాతంగా ఉంది.

అదే సమయంలో ఈ ఆర్ధిక సంవత్సరంలో హాచ్‌బ్యాక్‌ కార్ల అమ్మకాలు 30 శాతానికి తగ్గిపోయాయి. గత సంవత్సరం ఇదే కాలంలో హాచ్‌బ్యాక్‌ కార్ల అమ్మకాలు 35.1 శాతంగా ఉన్నాయి.  మొదటిసారి కారు కొనుగోలు చేస్తున్న వారిలో ఎస్‌యూవీలు తీసుకుంటున్న వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఎక్కువ గ్రౌండ్‌ క్లీయరెన్స్‌, లుక్‌ పరంగా బాగుండటం, కారులో ఎక్కువ స్పేస్‌, ఎక్కువ ఆధునిక ఫీచర్లు కోరుకునే వారు ఎస్‌యూవీలనే కొనుగోలు చేస్తున్నారు.

 ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అనేక ఎస్‌యూవీ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు తమ పోర్టుఫోలియోలో ఎస్‌యూవీలకే పెద్ద పీట వేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌ కారు ధర సాధారణంగా 4 లక్షల లోపుగానే లభిస్తుంది. అదే ఎస్‌యూవీల ధరలు కనీసం 10 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

దేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరగడానికి మన రోడ్ల కండిషన్‌ కూడా ఒక కారణం. రోడ్లు సరిగాలేనందు వల్ల చిన్నకార్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్‌యూవీలకు గ్రౌండ్‌ క్లీయరెన్స్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోడ్లు సరిగాలేకున్నా పెద్దగా ఇబ్బంది ఉండటంలేదు.  దీనికి తోడు కుటుంబాల ప్రయాణాలు పెరిగాయి. ఏదైనా శుభకార్యాలకు వెళ్లినా, యాత్రలకు, హాలీడే ట్రిప్‌లకు వెళ్లినా కుటుంబం సభ్యులంతా కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ప్రయాణాలకు ఎస్‌యూవీలు అనుకూలంగా ఉండటం కూడా వాటి అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.